మోర్తాడ్, డిసెంబర్ 17: చిన్నచిన్న బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదని, ఆరు గ్యారంటీలు 13 హామీల ఊసే లేదని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. బిల్లుల చెల్లింపులో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ర్టానికి ఆదాయం వస్తుంది.. అప్పులు తెస్తున్నారు.. అయినా చిన్నచిన్న బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 1.27 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. సంవత్సర కాలంగా రాష్ర్టానికి ఆదాయం వస్తున్నా.. సీడీపీ, ఎస్డీఎఫ్ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు కూడా బిల్లులు ఎందుకు క్లియర్ చేయడం లేదని అడిగారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే కుల సంఘాల భవనాలు, మహిళా భవనాలు, కల్యాణమండపాలు, బడులు.. ఇలా 143 పనులకు రూ.6 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు చెల్లించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.
33 గుడులకు రూ.3 కోట్ల బిల్లులు చెల్లించలేదని చెప్పారు. ఇది ఒక్క బాల్కొండ నియోజకవర్గం పరిస్థితి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఉన్న సమస్యనే అని చెప్పారు. చిన్నచిన్న పనులు చేసింది కాంట్రాక్టర్లు కాదని, విద్యాకమిటీలు, కుల సంఘాలు, మహిళాసంఘాల వాళ్లు కూడి కట్టించుకున్నారని తెలిపారు. ఇటువంటి చిన్న బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించక పోవడం కారణంగా పనులు చేసిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు.