మోర్తాడ్, సెప్టెంబర్ 24: జీఎస్టీ తగ్గించడం ద్వారా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు రూ.5 వేలు మిగిల్చామని బీజేపీ ఎంపీ అర్వింద్ అంటుండు. అంటే ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.5 వేల చొప్పున గత తొమ్మిదేండ్లలో రూ.5.40 లక్షలు జీఎస్టీ పేరిట దోచుకున్నట్లు అర్వింద్ ఒప్పుకున్నట్లే కదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో లేని జీఎస్టీని కొత్తగా అమలు చేసి దేశ ప్రజలపై భారం మోపింది బీజేపీ మోదీ ప్రభుత్వమేనని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
ఈ ఒక్క సంవత్సరమే జీఎస్టీ పేరిట అక్రమంగా దోచిన రూ.22లక్షల కోట్ల నుంచి కేవలం రూ.2 లక్షల కోట్ల జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఏదో మేలు చేసినట్లు బీజేపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.15వేలు మిగిల్చామని మరో బీజేపీ ఎంపీ రఘునందన్ అంటున్నాడని గుర్తు చేసిన వేముల.. గత తొమ్మిదేళ్లుగా ప్రతి కుటుంబం నుంచి నెలకు రూ.15వేల చొప్పున మీరు దోచుకున్నట్లేనా? అని ప్రశ్నించారు.
అసలు ఎంపీలు దిమాక్ ఉండి మాట్లాడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, షర్ట్, పాయింట్, టీవీ, సైకిల్‌మోటార్, కారు ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వమే కదా? ఇంకా ఎన్ని రోజులు ఈ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో ఏ విధంగా మోసం చేశారో ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు ఇదే ప్రజలు మీకు ఓట్ల కోతలు పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.