మోర్తాడ్, మార్చి 25: ఎస్సారెస్పీ బ్యాక్షోర్(వెనుక తీర ప్రాంతం)లో బ్రహ్మాండమైన ఐలాండ్స్, చూడదగ్గ ప్రదేశాలు, అనేక జీవజాతులు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్అండ్బీ, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్స్ శాఖలపై మంగళవారం చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఎస్సారెస్పీని టూరిజం స్పాట్‌గా చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలోనే ప్రతిపాదనలు చేశామని, ఇరిగేషన్ ట్యాండ్స్ టూరిజం వారికి బదిలీ కూడా చేసినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నదని, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లికి కూడా విన్నవించినట్లు చెప్పారు. వెంటనే ఎస్సారెస్పీ బ్యాక్షోర్ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌పై భాగంలో బాసర సరస్వతీ పుణ్యక్షేత్రం ఉన్నదని, ప్రాజెక్టు నుంచి బాసర దేవాలయం వరకు బోటు సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
ఉత్తర తెలంగాణలో నిరుద్యోగ యువత చాలా మంది ఉపాధి కోసం లేబర్ పనిమీద గల్ఫ్ వెళ్తుంటారని, ఏదైనా స్కిల్ వర్క్ నేర్చుకుని వెళ్తే వారికి వేతనం ఎక్కువగా లభిస్తుందన్న ఉద్దేశంతో మోర్తాడ్‌లో రూ.5కోట్లతో న్యాక్ సెంటర్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భూమిపూజ చేసి టెండర్ ప్రక్రియ కూడా పూర్తికాగా.. కానీ పనులను మంత్రి రద్దుచేశారని తెలిపారు. దానిని తిరిగి కొనసాగించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
బాల్కొండ నియోజకవర్గంలో పదేండ్లలో 52 దేవాలయాలు నిర్మించామని, ఇంకా 35 ఆలయాలు మంజూరై వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఎనిమిది ఆలయాల నిర్మాణ పనులు బిల్లురాక నిలిచిపోయాయని, అలాగే టెండర్ పూర్తయి అగ్రిమెంట్ కాని ఆలయాలు తొమ్మిది ఉన్నాయని వివరించారు. మంజూరై టెండర్లు పిలవాల్సిన దేవాలయాలు 17 ఉన్నాయని, వివిధ దశల్లో వీటిని క్లియర్ చేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమ్మర్‌పల్లిలో మినీ స్టేడియం నిర్మించామని, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరారు. ఆర్అండ్బీ శాఖలో గత ప్రభుత్వ హయాం లో మంజూరైన పనులు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. ఏజెన్సీలకు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆన్‌గోయింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో మంజూరైన అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కార్ రద్దుచేసిందని తెలిపారు. అభివృద్ధి పనులపై ప్రజలు ఆశతో ఉన్నారని, వెంటనే కాకున్నా రానున్న మూడేండ్లలో వాటిని చేపట్టేలా చూడాలని కోరారు.