శక్కర్‌నగర్, ఫిబ్రవరి 9: బోధన్ ఎక్సైజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఏండ్ల తరబడి కార్యాలయం ఆవరణలో మగ్గడంతో అవి తుప్పుబట్టి పనికిరాకుండా పోతున్నాయి. బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం అద్దె భవవనంలో కొనసాగుతున్నది. స్థలం లేక సీజ్ చేసిన వాహనాలను ఎక్కడపడితే అక్కడే ఉంచారు. అవి ఎండకు ఎండి, వానకు తడిసి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
రన్నింగ్ కండీషన్లోనే వాహనాలు పట్టుబడినా, వాటిని సకాలంలో వేలం వేస్తే సరైన ధర వస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి. వీటిని ఏండ్ల పొడవునా కార్యాలయ ఆవరణలోనే ఉంచడంతో అవి పాడై పనికిరాకుండా పోతున్నాయి. అధికారులు వేలం వేసే సమయానికి అవి పాత ఇనుప సామాన్లు వ్యాపారాలు చేసే వారు మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం బోధన్ ఎక్సైజ్ కార్యాలయంలో సుమారు 4 ఆటోలు, రెండు కార్లు, సుమారు 50కి పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. వీటిని ఇప్పటికైనా వేలం వేస్తే కొంతమేరకైనా ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి.
బోధన్ ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసిన వాహనాలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం వేస్తున్నాం. ఇటీవలే కొన్ని వాహనాలు వేలం వేశాం. కొన్ని కేసుల్లో ఉన్న వాహనాలకు వేలం వేయడానికి కుదరదు. అయినా, మిగతా వాహనాల వేలానికి సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం వేసేందుకు చర్యలు చేపడతాం.
– పవన్ గౌడ్, ఎక్సైజ్‌శాఖ సీఐ, బోధన్