Vadde Obanna | కంఠేశ్వర్, జనవరి 11 : స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్టీఏ సభ్యుడు నరేందర్ గౌడ్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పీ వెంకటేష్, రాము, శంకర్, నరాల సుధాకర్, బంగారు సాయిలు, ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.