నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ తాడ్వాయి, డిసెంబర్ 5: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ముందుగా మట్టి నమూనాలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వాడకంతో నేల సారవంతంగా మారతుందని, పశువులు, కోళ్లు, వర్మి కంపోస్టు ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రతి మూడు సంవత్సరాలకోసారి భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయశాఖ అధికారి అమర్‌ప్రసాద్, సర్పంచ్ అనసూయ, సొసైటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఏఈవోలు గజానంద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడారు. నేల సంరక్షణ చర్యల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలు, సేంద్రియ వ్యవసాయం, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై వివరించారు. రైతులు పంట మార్పిడి అవలంబించాలని, అంతర పంటలు సాగుచేస్తే లాభాలు గడించవచ్చని తెలిపారు. కొయ్యకాళ్లను తగులబెట్టడం భూమికి చేటన్నారు. నిప్పుపెట్టడంతో పంటలకు మేలు చేసే మిత్రపురుగులు మృతిచెందడమే కాకుండా భూసారం తగ్గుతుందన్నారు. ఎకరాకు రెండు బస్తాల సూపర్ వేసి వరికొయ్యలను నేలలో కలియ దున్నడంతో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10శాతం పెరుగుతాయన్నారు. సమావేశాలలో ఎంపీపీ కర్రె మాధవీ బాల్‌రాజ్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.
రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి సూచించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామ రైతు వేదికలో రైతులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. భూమి సారాన్ని కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల సాగులో వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవో శ్రీకాంత్, ఏఈవో రాకేశ్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.