డిచ్పల్లి, జూలై 16: తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏరాటైన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కులపతి హోదాలో ప్రసంగించారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాల్లో 24 ఉప విభాగాలు, 31 కోర్సులతో భిక్కనూర్, సారంగాపూర్ క్యాంపస్‌లతో సహా ప్రధాన క్యాంపస్‌లో విద్యావికాసం చెందడం ఆనందంగా ఉందని తెలిపారు.
స్నాతకోత్సవ ఏర్పాట్లు కేవలం విద్యాపరమైన లక్ష్యసాధన మాత్రమే కాదని విశ్వవిద్యాలయంలో నాణ్యమైన సాంకేతిక విద్య, ఉపాధి కల్పించే భవిష్యత్తు ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుడిని తయారు చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడమేనని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందన్న కొఠారి కమిషన్ వ్యాఖ్యలు వర్సిటీ విజయాలు రుజువు చేస్తున్నాయన్నారు.
విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఆందోళనతో పాటు అవకాశాలు కనిపిస్తాయని, ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరుగెత్తాలని ముఖ్యఅతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ సూచించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను, అభిరుచులను బట్టి అనేక రకాలుగా స్థిరపడే అవకాశముందన్నారు. జీవితమనేది పందెం కాదని, ఇది ఒక ప్రయాణం మాత్రమేనని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ప్రయాణానికి సమయస్ఫూర్తి, లోతైన అధ్యయనంతో పాటు తీసుకునే నిర్ణయాలను బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. టీయూలో త్వరలోనే ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు హామీ ఇచ్చారు. వర్సిటీ పరిధిని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో ప్రతిభ చూపిన 132 మంది విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలు, 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సుర్యనారాయణ గుప్తా, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, రిజిస్ట్రార్ యాదగిరి, వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాలోని పలువురు ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భేటీ అయ్యారు. తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి హా జరైన ఆయన.. సాయంత్రం నిజామాబాద్‌లో ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ తదితరులు గవర్నర్‌కు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాల ప్రముఖులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. జిల్లా లో పలు శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించా రు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆయా శాఖల పనితీరును గవర్నర్‌కు వివరించారు.