జక్రాన్‌పల్లి, మే 23 : మండలంలోని జక్రాన్‌పల్లి తండా సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జక్రాన్‌పల్లి తండాకు చెందిన బానోవత్ శ్రీనివాస్ (35), కేశ్‌పల్లి తండాకు చెందిన నవీన్(33) అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనకు సంబంధించిన వివరాలు.. తన అన్న శంకర్ పెండ్లిరోజు సందర్భంగా కేక్ కోసం శ్రీనివాస్ తన బంధువైన నవీన్‌తో కలిసి బైక్‌పై జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి వెళ్లారు.
కేక్ తీసుకొని తిరిగి వస్తుండగా తండా సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కంటైనర్ బైక్‌ను ఢీకొట్టి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, నవీన్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. శ్రీనివాస్‌కు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.