నందిపేట్, ఆగస్టు 1 : ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గ పరిధిలోని మచ్చర్ల, జోర్పూర్, ఖుద్వాన్పూర్, కంఠం, చిక్లీ, గుంజిలి గ్రామాలకు నూతన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.120 కోట్ల 89 లక్షలు మంజూరు చేసింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలతో 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందనున్నది. మచ్చర్ల, జోర్పూర్, ఖుద్వాన్పూర్లో రూ.40 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న కొత్త లిఫ్ట్ నిర్మాణం ద్వారా దాదాపు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనున్నది. అలాగే కంఠం, చిక్లీ, గుంజలిలో రూ.80కోట్ల 39 లక్షలతో నిర్మించే కొత్త లిఫ్ట్‌ల ద్వారా మరో 5 వేల ఎకరాల వ్యవసాయ ఆయకట్టుకు లబ్ధి చేకూరనున్నది. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ జలాల ఆధారంగా ఈ లిఫ్టుల నిర్మాణం జరగనున్నది. సీఎం కేసీఆర్ సహకారంతో తమ చిరకాల వాంఛ సాకారమైందని ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లిఫ్ట్‌లు అన్నదాతలకు కేసీఆర్ గిఫ్ట్ : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన లిఫ్టులు అన్నదాతలకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మా పెద్దరైతు కేసీఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆర్మూర్ అంటేనే అగ్రికల్చర్ హబ్, తిండి గింజల బాండాగారం ఆర్మూర్ నియోజకవర్గం. నూతన లిఫ్ట్‌లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు పాదాభివందనం చేస్తున్నానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మండలంలోని ఖుద్వాన్పూర్, కంఠం, జోర్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కృషితో సీఎం కేసీఆర్ సహకారంతో వందల కోట్ల రూపాయల విలువైన ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేసినందుకు గ్రామాల్లోని రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సర్పంచులు సాయన్న, గంగారాం, ఎంపీటీసీలు రవి, ప్రవీణ్‌గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్‌చారి, సాతు ప్రవీణ్, యూత్ నాయకులు అభిలాష్, దినేష్, జావీద్, పెరిక నాగన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.