డిచ్పల్లి, జూలై 31: తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందని వీసీ యాదగిరి రావు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభమవుతుందని, మూడో విడుత కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి ఆయన గురువారం వర్సిటీలో విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, డేటా సైన్స్ కోర్సులు మంజూరైనట్లు వెల్లడించారు. ఒక్కో కోర్సులో 60 సీట్లతో మొత్తం 240 మందికి ప్రవేశాలు లభిస్తాయన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ కోసం ఇటీవలే నిర్మించిన సైన్స్ కళాశాల భవనాన్ని కేటాయిస్తామన్నారు. అన్నిరకాల మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారని వీసీ తెలిపారు.