కంఠేశ్వర్, ఆగస్టు 19: విద్యుత్ స్తంభాలపై డిష్ కేబుల్ వైర్లను తొలగించాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల టీవీ, ఇంటర్నెట్ కేబుళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యంతో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేబుళ్లను తొలగించాలని 16 సర్కిళ్ల ఎస్ఈలను మంగళవారం ఆదేశించారు. మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గుత్తులుగా కేబుల్ వైర్లు ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, మొదట ప్రజల భద్రత ముఖ్యమని పేర్కొన్నారు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలని లేకుంటే తొలగించాలని స్పష్టం చేశారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి, ప్రమాదకరంగా ఉన్న లైన్లను క్లియర్ చేయాలని సూచించారు. వినాయక నిమజ్జన రూట్ క్లియరెన్స్ ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభంపై అస్తవ్యస్తంగా ఉన్న డిష్, ఇంటర్నెల్ కేబుళ్లను విద్యుత్ సిబ్బంది మంగళవారం తొలగించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు వారి కేబుళ్లను సక్రమ పద్ధతిలో క్లిప్పింగ్ క్లాంపిన్ పద్ధతి అనుసరించి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని విన్నవించారు.