జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పేరుతో ఎడాపెడా జరిమానాల పర్వానికి శ్రీకారం చుట్టిన పోలీసులతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. చట్టాన్ని అమలు చేయడంలో గుడ్డిగా ముందడుగు వేస్తుండగా రహదారులపై మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, కూడళ్ల వద్ద ఏర్పడిన అస్తవ్యస్థ పరిస్థితులపై ఎవరూ నోరు మెదపడం లేదు.
వాహనాదారుడికి తెలియకుండా దొంగ చాటున ఫొటోలు తీసి పోలీస్ శాఖకు చెందిన వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి సాయంత్రం మొబైల్ ఫోన్లకు ఈ -చలానా మెస్సేజ్ పంపిస్తున్నారు. దీంతో వాహనదారుడు కంగుతినాల్సి వస్తోంది. ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో పాటు పోలీసుల తీరు కూడా ఒక కారణంగానే కనిపిస్తోంది. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. వైఫల్యాలను విస్మరిస్తూ ముందుకెళ్లడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-నిజామాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా పెరగడంతోపాటు వాహనాల సంఖ్య భారీ గా పెరిగింది. విశాలమైన రోడ్లు కాస్తా రద్దీతో కుచించుకు పోతున్నాయి. ప్రస్తు తం 11 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా..ఇందులో ఏ ఒక్కచోటా జీబ్రా క్రాసింగ్ మచ్చుకూ కనిపించడం లేదు. సీపీ క్యాంప్ కార్యాలయం, డీపీవోకు సమీపంలోని జంక్షన్లలోనూ జీబ్రా క్రాసింగ్ లేదు. దీంతో వాహనాల నిలుపడానికి వాహనదారులు తికమకకు గురవుతున్నారు. గందరగోళం మధ్యలోనే పోలీసు లు ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు.
హెల్మెట్ ధారణపై నిబంధన అమలు చేస్తున్న పోలీసులు ఈ అంశాన్ని గాలికి వదిలేశారు. ప్రశ్నిస్తే అది తమ పరిధిలోనిది కాదని బదులిస్తున్నారు. నగరపాలక సంస్థ చేయాల్సిన పనికి పోలీస్ శాఖకు ఏం సంబంధం అంటున్నారు. జీబ్రా క్రాసింగ్ లైన్లు లేకపోవడంతో కూడళ్ల వద్ద వాహనాదారులు ముందుకొచ్చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు ఆశిస్తున్న లక్ష్యం నీరుగారడమే తప్ప ఎక్కడా నిబంధనలు అమలుకావడంలేదని ప్రజలు భావిస్తున్నారు.
నిజామాబాద్‌లో వాహనాల రద్దీకి తగ్గట్లుగా విరివిగా పార్కింగ్ స్థలాలే లేవు. నగరపాలక సంస్థ తరపున వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ నియంత్రణలో కాసింత ఉపశమనం ఉంటుంది. మరోవైపు వ్యాపార, వాణిజ్య భవనాల్లోని సెల్లార్లలో వాహనాల పార్కింగ్‌కు బదులుగా ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.దీంతో రోడ్లపై వాహనాలు వదిలేసి వెళ్తున్నారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. జనాల్లో మార్పు రావాల్సి ఉంది.
– నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్
కార్పొరేషన్లో అక్రమార్కుల తీరుతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడానికి కారణంగా మారుతోంది. దవాఖానలు, ప్రైవేటు వ్యాపార సముదాయాలకు సెల్లార్ నిర్మాణం కచ్చితంగా అమలు చేయాలి. కానీ కొన్ని ప్రైవేటు దవాఖానల్లో సెల్లార్లలో ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. భవన యజమానుల కక్కుర్తి, కార్పొరేషన్ అధికారుల చేతివాటంతో దవాఖానకు వచ్చే వాహనాదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తే సామాన్యుడికి జరిమానా విధిస్తున్నారు. పార్కింగ్ తలపోటుతో నిత్యం వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, పూసలగల్లి, కోటగల్లి, కుమార్‌గల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నగరానికి వివిధ అవసరాల కోసం వచ్చే లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు
ట్రాఫిక్ కూడళ్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని పోలీస్ శాఖ చెబుతోంది. ఈ మొత్తాన్ని నగరపాలక సంస్థ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత పాలకవర్గం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ అంశంపై పోలీసులు పలుమార్లు వినతులు సమర్పించినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ మధ్య సమన్వయ లోపం చెడిపోవడం మూలంగా సామాన్యులు బలవుతున్నారు.ఓ వైపు పోలీస్ కమిషనర్ ఆదేశాలను అమలు చేయలేక, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని దాటుకుని ట్రాఫిక్ పోలీసు విభాగం సతమతమవుతున్నది.
ఖలీల్‌వాడీ మీదుగా ఏడాది క్రితం అమలు చేసిన వన్ వే మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. రాజకీయ ఒత్తిడితో రోజుల వ్యవధిలోనే వన్ వే ఎత్తేయడం విమర్శలకు తావిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణలో రాజీలేకుండా పని చేయాల్సి ఉండగా పోలీసుల తీరు అడుగడుగునా వివాదాస్పదమవుతున్నది. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగితే నగరవాసులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం.