ఖలీల్‌వాడి, డిసెంబర్ 30: జిల్లా కేంద్ర శివారు గంగాస్థాన్-2లోని ఆధ్యాత్మిక ఆశ్రమంగా వెలుగొందుతున్న ఉత్తర తిరుపతి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో మరకత శ్రీచక్రంతో కూడిన అమ్మవారి ఆలయం, దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, ఆంజనేయు డి ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా సౌందర్యంతో ఈ క్షేత్రాన్ని భక్తులు నిత్యం వందల సంఖ్యలో దర్శించుకుంటారు. ఆలయంలో ప్రతినెలా అనఘాష్టమి వ్రతం, సంకష్టహర చతుర్దశి, హస్తా నక్షత్రం, శ్రవణా నక్షత్రం రోజున శ్రీనివాసుడి కల్యాణం, గురుపౌర్ణమి, దత్త జయంతి, దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, శ్రీరామనవమి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలకు స్వామీజీ రాక
ఆలయంలో ఈనెల 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ(అప్పాజీ) పాల్గొననున్నారు. ఇందుకోసం ఆలయాన్ని అందంగా ముస్తాబుచేశారు. శనివారం ఉదయం 10 గంటలకు స్వామీజీ ఆశ్రమానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు స్వాగత సభ, భక్తులతో నామార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి ఒకటిన పాదుకాస్పర్శ, శ్రీచక్రపూజ, శ్రీనివాస కల్యాణం, సంకీర్తన, స్వామివారి అనుగ్రహ భాషణం కార్యక్రమాలు ఉంటాయి. 2వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం, శ్రీచక్రపూజ, స్వామిజీ అనుగ్రహ భాషణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆంగ్ల నూతన సంవత్సరాదికి మొదటిసారి తెలంగాణకు వస్తుండగా..ఇందులో నిజామాబాద్‌కు వస్తుండడం విశేషమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.