ధిక్కార స్వరం సమరశంఖం
కాళోజీ జీవితం ఉద్యమాలతో సమ్మిళితం. తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సాహిత్యాలకు తన ధిక్కార స్వరాన్ని జోడించి అందరిలో ఒకటయ్యారు.
- తెలంగాణ సైరన్ మోగించిన ఉద్యమకారుడు
- నేడు కాళోజీ జయంతి
- తెలంగాణ భాషా దినోత్సవం
నిజామాబాద్ కల్చరల్, సెప్టెంబర్ 8: కాళోజీ జీవితం ఉద్యమాలతో సమ్మిళితం. తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సాహిత్యాలకు తన ధిక్కార స్వరాన్ని జోడించి అందరిలో ఒకటయ్యారు. ఆనాటి రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ పోరుసల్పారు. స్వాతంత్య్రానంతరం ఎప్పటికప్పుడు తన అక్షరాలు, మాటల తూటాలతో ఖండిస్తూ ముందుకు సాగిన మహోన్నతుడు. బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సైరన్ మోగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ నిరంతరం పరితపించిన వ్యక్తి. తాను చేసే పనిని గొడవగానే భావించి… అదే నాగొడవ.. ఇదే కాళోజీ గొడవ అంటూ నినాదించారు. నేడు (శనివారం) కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం..
రచనలు… అవార్డులు
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామానికి చెందిన రంగారావు – రమాబాయి దంపతులకు 1914 సెప్టెంబర్ 9న కాళోజీ జన్మించారు. హన్మకొండ జిల్లా మణికొండలో ప్రాథమిక విద్య, హైదరాబాద్లో ఉన్నతవిద్యను అభ్యసించారు. 15ఏండ్ల వయస్సు నుంచే రాజకీయ ఉత్సవాలు, కవితా రచన, వ్యాసాంగాల్లో మునిగిపోయారు. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, నిజాంస్టేట్ కాంగ్రెస్లో ఉంటూ.. నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్పదిట్ట. ఆయన షాద్ కలం పేరుతో రచనలు చేసేవాడు. రామేశ్వరరావును పెద్ద కాళోజీగా పిలిస్తే… నారాయణరావును చిన్న కాళోజీగా పిలిచేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలంపాటు పలు పోరాటాల్లో పాల్గొంటూ…. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్లోని దౌర్జన్యాలను, వ్యక్తుల ప్రవర్తన, నడవడికను ఎండగడుతూ రన్నింగ్ కామెంటరీగా కవిత్వం రాశారు. అనేక రచనలు చేశారు. 1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న కాళోజీ మరెన్నో అవార్డులు సొంతం చేనుకున్నారు.
తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి..
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. 2014 సెప్టెంబర్ 9న కాళోజీ 100వ జయంతి సభలో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని జీవో ప్రకటించి, ఆ మేరకు ఏటా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.అన్ని జిల్లా కేంద్రాల్లో భాషా చైతన్య కార్యక్రమాలతోపాటు విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస , కవితా పోటీలు నిర్వహిస్తూ స్మరించుకోవడం విశేషం.
ప్రజాకవి కాళోజీ
ఆయన జీవితాంతం ప్రజల కోసమే బతికారు. కాళోజీ ప్రజల మనిషి. నైజాం రాజులతో పోరాటం చేసి రజాకార్లను ఎదురించిన ధీరశాలి. తెలంగాణ తొలి.. మలిదశ ఉద్యమంలో ముందున్న నాయకుడు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం హర్షణీయం.
– ఘనపురం దేవేందర్, ఉపాధ్యాయుడు, కవి
తెలంగాణకు దారి, దీపం ఆయనే..
రాష్ట్ర తెలంగాణ రచయితల సంఘం అసమ్మతి, నిరసన, ధిక్కార స్వరం ఆయనది. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో మంచి విషయాలు ప్రచారం చేస్తూ జీవించారు. ప్రజలకు తన సందేశం అందించేందుకు ఒకపెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చగలగడం కాళోజీ ప్రత్యేకత.
–నాళేశ్వరం శంకర్, అధ్యక్షుడు,తెలంగాణ రచయితల సంఘం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

