వినాయక్ నగర్, అక్టోబర్ 17: నగరం నడిబొడ్డున ఓ కానిస్టేబుల్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో పోలీసుల ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను ఓ దొంగ కత్తితో పొడిచి పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా రోడ్డు ప్రాంతంలో నివాసముండే రియాజ్‌పై చైన్స్నాచింగ్తో పాటు ఇతర చోరీ కేసులున్నాయి.
పరారీలో ఉన్న అతడి ఆచూకీ గురించి సీసీఎస్‌కు సమాచారం వచ్చింది. దీంతో సీసీఎస్ ఎస్సై భీమ్రావు, కానిస్టేబుల్ బి.ప్రమోద్(48) కలిసి బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు.. అతడిని తనిఖీ చేయకుండానే ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్ పై ఎక్కించుకున్నారు. వినాయక్ నగర్ మీదుగా వస్తూ అక్కడ ఉన్న డ్రై ఫ్రూట్ షాపు వద్ద చేరుకోగా, నిందితుడు తన వద్ద ఉన్న కత్తి తీసి కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేశాడు.
విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను హుటాహుటిన 108 వాహనంలో దవాఖానకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 2003 బ్యాచ్‌కు చెందిన ప్రమోద్‌కు భార్య, ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. విషయం తెలిసి సీపీ సాయిచైతన్య, ఇతర ఉన్నత అధికారులు హుటాహుటిన దవాఖానకు చేరుకున్నారు.