Theft | వినాయక్ నగర్,జూన్:15: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారు. నగరంలోని వినాయక్ నగర్ లోని ప్రధాన రోడ్డు పక్కన గల సూపర్ మార్కెట్ వెనకాల బచ్చు ప్రసాద్ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు పడి బంగారు నగలు నగదు ఇతర విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. సదరు వ్యాపారి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం షిరిడి దర్శనానికి వెళ్లారు.
ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళం ధ్వంసం చేసి లోనకి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలోంచి సుమారు 12 తులాల వరకు బంగారు నగలతో పాటు రూ.పదివేల నగదు, ఓ గదిలో గల ల్యాప్టా, మొబైల్ ఫోన్ ను దొంగిలించుకుపోయినట్లు తెలిసింది. ఆదివారం ఉదయాన్నే పక్కింటి వారు ఈ ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి నాలుగో టౌన్ పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న నగర సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై-2 ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
అయితే చోరీకి పాల్పడిన దుండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చినట్లుగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చోరీకు పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు నగర సీఐ పర్యవేక్షణలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.