మోర్తాడ్, జనవరి 20 : ఏటా గంపెడాశతో పసుపు పండిస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. తొమ్మిదినెలల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లాభాలు పొందాలని పసుపుపంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ తప్పడం లేదు. పసుపుబోర్డు తెప్పిస్తానని ఎంపీ బాండ్ పేపర్ రాసివ్వడం ఇక్కడి పసుపు రైతులకు ఎంత ఊరటనిచ్చిందో..ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు అంత నిస్పృహను రైతులకు కలిగించాయి. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, తెగుళ్ల బెడద, వ్యాపారుల కుమ్మక్కు ఇవన్నీ రైతుల కంటనీరు తెప్పిస్తున్నాయి. ఈ కారణంగా పసుపుపంట పండించేందుకు గత సంవత్సరం నుంచి రైతులు వెనుకంజ వేస్తున్నారు.
పెరిగిన కూలీలు
పసుపుపంట వేసినప్పటి నుంచి మార్కెట్కు తరలించే వరకు అవసరమయ్యే కూలీల ధరలు పెరగడం, మార్కెట్లో మాత్రం పసుపునకు ధర తగ్గిపోవడంతో పసుపురైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పసుపు ధర క్వింటాలుకు ఆరంభంలో రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ఉండేది, కానీ ప్రస్తుతం రూ.4వేలకే ఆరంభ ధర చేరుకున్నది. దీంతో పసుపుపండించిన రైతులు నిరాశకు గురవుతున్నారు. కూలీల రేట్లు మాత్రం రోజురోజుకూ పెరిగిపోవడం రైతులకు భారంగా మారింది.
పసుపు విత్తడానికి, రిక్కడానికి మహిళలకు రోజుకు రూ.200 కూలీ ఉండగా ప్రస్తుతం ఇది కాస్త రూ.300 చేరుకున్నది. పసుపు తవ్వే కూలీలకు గత సంవత్సరం రోజుకు రూ.900 ఉండగా ఈసారి ఇది రూ.1200 చేరుకున్నది. ఇదికాకుండా గత సంవత్సరం డ్రమ్ము పసుపు ఉడకబెట్టి పాలిష్ చేసినందుకు రూ.160 ఉండగా ప్రస్తుతం ఇది రూ.200 చేరుకుంది. ఈవిధంగా ప్రతి దానికీ కూలీల ధరలు పెరుగుతుండగా ధరలు మాత్రం పడిపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పసుపుధర పడిపోవడంతో నష్టాలు
పసుపుధర మార్కెట్లో విపరీతంగా పడిపోవడం మాకు ఎంతో నష్టాలను కలిగిస్తున్నది. ధర బాగుంటే ఆర్థికంగా కుదుటపడుతామన్న ఆశతో తొమ్మిదినెలలు కష్టపడి పండించే ఈ పంటకు మార్కెట్లో ఏటా ధర తగ్గిపోవడం బాధాకరం. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పసుపునకు ధర తగ్గే విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇది కూడా తెలంగాణ రైతుల పట్ల పక్షపాతం చూపడానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-పర్సదేవన్న, రైతు, దోన్పాల్
కూలీల ధరలు పెరుగుతున్నాయి
రోజురోజుకూ కూలీల ధరలు పెరుగుతున్నాయి.. కానీ పసుపు ధర మాత్రం పడిపోతుంది. దీంతో పసుపు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పసుపుబోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చిన ఎంపీ ముఖం చాటేసిండు, కనీసం పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగానైనా చూడాల్సింది. రాజకీయం కోసం వాడుకుని పసుపురైతులను రోడ్డుకు వదలేయడం బాధాకరం.
-గుండేటి శంకర్, రైతు పాలెం