ఐకేపీలో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీవోఏ)కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచించారు. శాసనమండలిలో ఆమె బుధవారం మాట్లాడుతూ.. వీవోఏల సమస్యలను లేవనెత్తారు. కేసీఆర్ హయాంలో వారికి పలు దఫాలుగా వేతనాలు పెంచామని చెప్పారు. ప్రస్తుతం వీవోఏలపై పనిభారం తీవ్రంగా ఉందన్న కవిత.. ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. వేతనాలను రూ.26 వేలు చేస్తామని చెప్పారని, ఆ మాట నిలబెట్టుకోవాలని సూచించారు. వీవోఏలకు సీసీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే, ప్రతి గ్రామంలో మహిళాసంఘ భవనం నిర్మించాలని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని వీవోఏలు కోరుతున్నారని, వాటిని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు.
విమర్శలను తిప్పికొట్టిన వేముల
సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి జాతీయ రహదారి నిర్మాణంలో ప్రభుత్వం చేసిన విమర్శలను మాజీ మంత్రి వేముల బుధవారం అసెంబ్లీలో తిప్పికొట్టారు. ఈ రహదారిని నేషనల్ హైవేగా మార్చాలని తమ హయాంలోనే ప్రతిపాదనలు పంపించామని, కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతి లభించిందన్నారు. అలైన్మెంట్ రూపొందించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు పంపించామని చెప్పారు. కానీ, అక్కడి నుంచి అప్రూవల్ రాకపోవడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించలేదని వివరించారు.
ఆటోలో అసెంబ్లీకి..
ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఆటోలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఆటో కార్మికులతో కలిసి ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
-వేల్పూర్, డిసెంబర్ 18