కంఠేశ్వర్, జూలై 12 ః పరిసరాల అపరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని డెయిరీ ఫారం ప్రాంతంలో డెంగీ వ్యాధి బారినపడిన కుటుంబాన్ని డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్‌తో కలిసి శుక్రవారం పరామర్శించారు. డ్రైడే – ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా డెయిరీ ఫారంలో పర్యటించి సీజనల్ వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అర్సపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సామ్రాట్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి, జూలై 12 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రాజేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఏర్గట్ల, జూలై 12: మండలంలోని నాగేంద్రనగర్‌లో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ప్రజలతో ఎంపీవో శివచరణ్ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచరు, ఆశ వర్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీమ్‌గల్, జూలై 12: ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అజయ్ పవార్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడారు. ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు కలిగిస్తాయన్నారు. త్వరలో వయోజనులకు బీసీజీ టీకా వేయనున్నట్లు వివరించారు. గతంలో క్షయ వ్యాధితో బాధపడిన వారు ప్రస్తుతం క్షయ వ్యాధి కాంటాక్ట్‌లు, 60 ఏండ్లు వయస్సు మించిన వృద్ధులు, తీవ్ర పోషకాహార లోపం ఉన్న వారు పొగ తాగే అలవాటు ఉన్న వారు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వసంత్‌కుమార్, హెల్త్ ఎడ్యూకేటర్ కట్కం శంకర్, ఆరోగ్య పర్యవేక్షకురాలు భూలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్, జూలై12: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో మున్సిపల్ కమిషనర్ రాజు విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.