ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఆదివారం విరమించారు. ఆలయాల్లో స్వామి వారికి అన్నపూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అగ్నిగుండాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలుచోట్ల కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి.
హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. పలుచోట్ల అగ్ని గుండాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకోవడంతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ఉపవాసాలు ఆచరించిన భక్తుల కోసం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానాలు ఏర్పాటుచేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్‌లోని సిద్ధులగుట్టపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. మద్నూర్ మండలం సోమలింగేశ్వరాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే షిండే దర్శించుకున్నారు.
-నమస్తే తెలంగాణ యంత్రాగం, ఫిబ్రవరి 19