కామారెడ్డి, జూన్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా బడీడు, బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. జూన్ 6 నుంచి 19 వరకు చేపడుతున్న బడిబాట కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఎంపీవోలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, విలేజ్ ఆర్గనైజేషన్లు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.
6న బడిబాట కార్యక్రమంపై విలేజ్ ఆర్గనైజేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల నమోదుకు చర్యలు తీసుకుంటారు. 7న ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తిస్తారు. 8 నుంచి 10వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రుల్లో చదువుపై అవగాహన కల్పిస్తూ పిల్లలను బడికి పంపేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11న గ్రామసభ ఏర్పాటు చేసి 3నుంచి 10వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చిస్తారు. 12న పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించి నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, 18న డిజిటల్ తరగతులపై అవగాహన, 19న ఆటల పోటీలు నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 1014 పాఠశాలలుండగా.. అందులో ప్రాథమిక పాఠశాలలు 697, ప్రాథమికోన్నత పాఠశాలలు 127, ఉన్నత పాఠశాలలు 187 ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అప్పటి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై అంతగా శ్రద్ధ చూపడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యారంగానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా తూతూ మంత్రంగానే చేపడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పిస్తున్నారు. ఈసారి కూడా విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్పిస్తారా? లేక తూతూ మంత్రంగా నిర్వహిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు ఆకర్షితులు కావొద్దని, ప్రభుత్వం ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. నేటి నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అందరి సహకారంతో బడిబాటను విజయవంతం చేస్తాం.