నిజామాబాద్, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘోరంగా దెబ్బతిన్నది. రెండేళ్లుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్ లేకపోవడంతో ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. చేతిలో రూ.కోట్లు విలువ చేసే స్థిర ఆస్తులు ఉన్నప్పటికీ వాటిని అమ్ముకోలేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. బిడ్డల పెళ్లిళ్లకు, ఇతరత్రా అవసరాలకు భూములు విక్రయించాలని భావించిన వారికి గడ్డు కాలమే ఎదురవుతోంది. కేసీఆర్ హయాంలో పలు చోట్ల రూ.50లక్షలు పలికిన ఎకరం వ్యవసాయ భూమి ఇప్పుడైతే రూ.30లక్షలకు పడిపోయింది. నెల క్రితం హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలం పాటలోనూ నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో ప్రధాన రహదారి పక్కన రూ.22వేలకు గజం పలకడం స్థానికులను నిరాశకు గురి చేసింది.
ఇలా పడిపోయిన రియల్ వ్యాపారంతో భూ యజమానులంతా పాట్లు పడుతున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న వారంతా లక్కీడ్రా పేరుతో వల విసిరి భారీ ఎత్తున కూపన్లు విక్రయిస్తున్నారు. తెలివిగా తమ భూమిని అమ్ముకునేందుకు కొంత మంది వ్యక్తులు అడ్డదారిలో జనాలను ఆకట్టుకోవడం కనిపిస్తోంది. కొనబోతే కొరివి… అమ్మబోతే అడవి అన్నట్లుగా రియల్ ఎస్టేట్ రంగం మారడమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. లక్కీడ్రాలకు చాలా మంది ఎగబడుతున్నారు. ఇదీ అక్రమమా? సక్రమమా? అర్థం కాక సామాన్య జనాలంతా గందరగోళంలోనూ మునిగి తేలుతున్నారు.
పట్టింపులేని పోలీస్, రెవెన్యూ శాఖలు..
దీపావళి పండుగ సమయంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్లో ఇదే రకమైన లక్కీడ్రాకు ఓ వ్యక్తి తెర లేపాడు. రూ.50లక్షలు విలువ చేసే స్థలాన్ని లక్కీడ్రా కూపన్లు ద్వారా అమ్మకానికి పెట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు పక్కనే భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి బహిరంగంగానే ప్రచారం నిర్వహించినప్పటికీ పోలీసులు, రెవెన్యూ శాఖలు మౌనంగానే ఉండిపోయాయి. కళ్లకు కనిపించినప్పటికీ బహిరంగంగానే ప్రచారం జరిగినా వేల్పూర్ పోలీసులు కనీసం పట్టనట్లుగా వ్యవహరించారు. రెవెన్యూ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. సదరు వ్యక్తులతో కుమ్మక్కు అయ్యారా? అన్న అనుమానాలు వెలుగు చూశాయి. లక్కీడ్రా ద్వారా భూములు అమ్మకానికి పెట్టడం చట్ట విరుద్ధం.
ఈ అక్రమ వ్యవహారం జరుగుతుంటే కళ్లు మూసుకోవడం ఏమిటి? అన్నది చర్చనీయాంశమైంది. రూ.2500 చొప్పున వందలాది మందికి కూపన్లు జారీ చేస్తుండగా ఏమై నా లోపాలు జరిగితే బాధ్యులు ఎవరు? అన్నది అయోమయంగా మారింది. ఇలాంటి తంతు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా రాజంపేటలోనూ వెలుగు చూసింది. 2.10ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టిన ఓ వ్యక్తి ఏకంగా రూ.10వేలు చొప్పున కూపన్ ధర నిర్ణయించాడు. 500 మందికి విక్రయిస్తానని ప్రకటించాడు. సంక్రాంతి పండుగలోపు కూపన్లు స్వీకరించి విజేతను ప్రకటిస్తానని చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ పాలనాధికారి(జీపీవో) ప్రకటన విడుదల చేశాడు. లక్కీడ్రాలు నమ్మొద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది.
ప్రజలు మోసపోతే బాధ్యులెవరు?
రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిలా రియల్ వ్యాపారం కుదేలైంది. ధరలు అమాంతం పడిపోయాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు కేసీఆర్ ప్రభుత్వంలో రెక్కలు వచ్చి ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు భూముల క్రయ, విక్రయాలను పట్టించుకున్న నాథుడు కరువయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన ఈ సందిగ్ధతను అధిగమించి కొంత మంది నూతన ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తున్నారు. గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం ఇదంతా నిబంధనలకు విరుద్ధమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. లక్కీడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందం మేరకు భూములు చేతులు మారకపోతే ఎలా? అన్నది ప్రజలను వెంటాడుతోంది.
ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది. బహిరంగంగానే ఇష్టానుసారంగా అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చేష్టాలుడిగి చూస్తోంది. దీనంతటికీ స్థానికంగా తెర వెనుక పోలీసులు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి కార్యక్రమాలకు అనుమతి లేదని అడ్డు తగిలే ఖాకీలకు ఈ వ్యవహారాలు కనబడకపోవడం ఏమిటి? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకమైన ఉత్సవాలు, సంప్రదాయ పండుగల సమయంలో లక్కీడ్రాలు నిర్వహించుకోవడం పరిపాటిగా వస్తోంది. చట్టబద్ధంగా భూముల విక్రయానికి లక్కీడ్రాలు పెట్టడం అనేది చట్ట వ్యతిరేకమేనని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండటం తప్పా ప్రజలు అత్యుత్సాహం చూపితే మోస పోవడం ఖాయమని సూచిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…
ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. లక్కీడ్రాలు నిర్వహిస్తుండడం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తీసుకుంటాము. ఇలాంటి విషయాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.
– కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), నిజామాబాద్ జిల్లా