పెద్దకొడప్గల్, మే 15: జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘానికి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల రైతులు విక్రయానికి తీసుకొచ్చిన జొన్నలతోపాటు తూకం వేసిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. 10-15 రోజుల క్రితం జొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, తూకం వేసిన అనంతరం లారీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు తెలిపారు. జొన్న బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకి రూ.10-రూ.20 తీసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
210 బస్తాల జొన్నలు తూకం వేసి వారం రోజులైనా లారీలు రాలేదు. ప్రైవేటు లారీలో తరలించాలంటే బస్తాకి రూ.20 నుంచి రూ.25లు తీసుకుంటున్నారు. వ్యవసాయ సహకార సంఘంలో రూ.8 నుంచి రూ.10లు తీసుకుంటున్నారు. లారీలు రాక ఇబ్బందులు పడుతున్నాం.
ఇప్పటి వరకు 110 లారీలను పంపించాం. లారీల కొరత ఉండడంతో వర్షం నుంచి కాపాడేందుకు గోదాంలో నిల్వచేస్తాం. లారీలు వచ్చిన వెంటనే లోడ్ చేసి రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం.