కన్న తల్లినే దారుణంగా కొట్టి చంపాడో వ్యక్తి. అనంతరం తానూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం భవానీపేటలో శుక్రవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం వృద్ధురాలిని కుమారుడు తీవ్రంగా హింసించాడు. ఆమెను దవాఖానకు తరలించేలోపే మృతి చెందింది. ఇది తెలిసి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాచారెడ్డి,జనవరి 13 : కన్నతల్లినే కడతేర్చిన సంఘటన మాచారెడ్డి మండలంలోని భవానీపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిటుకుల నర్సవ్వ (70)కు నర్సారెడ్డి (45)అనే కుమారుడు ఉన్నాడు. ఇతను జల్సాలకు అలవాటు పడి ఉన్న పొలాన్ని అమ్మి నర్సవ్వ, భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో భార్య పిల్లలు గ్రామంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా ఉంటున్నారు. నర్సారెడ్డి తల్లి వద్దే ఉంటున్నాడు.
శుక్రవారం డబ్బుల విషయంలో గొడవ తలెత్తడంతో నర్సవ్వను తీవ్రంగా కొట్టాడు. దీంతో నర్సవ్వ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు 100 డయల్‌కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నర్సారెడ్డిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. నర్సవ్వను స్థానికులు ఆటోలో ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాను కొట్టడంతో తల్లి మృతి చెందిందని మనస్తాపంతో నర్సారెడ్డి తల్లి శవం ఎదుటే తలను గోడకు బాదుకోవడంతో పాటు అక్కడే ఉన్న హెల్మెట్ తీసుకొని కొట్టుకోవడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. తల్లిని చంపిన తనను ఏమైనా చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు తెలిపారు. సంఘటనా స్థలానికి కామారెడ్డిరూరల్ సీఐ శ్రీనివాస్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నర్సారెడ్డికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా తల్లిని చంపిన నర్సారెడ్డిని ఆయన కుమారులే కొట్టిచంపి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.