ఖలీల్‌వాడి, జనవరి 31: సీఎం రేవంత్‌రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను విచారణకు రావాలని నోటీసుల మీద నోటీసులు జారీ చేయిస్తూ శాడిజాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగమే తల తోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసు అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సిట్ పేరుతో నోటీసులు జారీ చేశారని తెలిపారు. విచారణకు సహకరిస్తానని, సిట్ బృందం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కి వచ్చి విచారించాలని కేసీఆర్ అభ్యర్థించినా, పరిగణనలోకి తీసుకోకుండా హైదరాబాద్‌లోనే విచారణకు రావాలని మళ్లీ నోటీసులు జారీ చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
అబద్ధాల పునాదులపై ఫేక్ హామీలతో ప్రజలను మభ్యపెట్టి రేవంత్‌రెడ్డి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారన్నారు. రెండేండ్లలో ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి చిప్పకూడు తిన్న రేవంత్‌రెడ్డి ఒక ప్రిజనరీ అని, తన దార్శనిక పాలనతో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ ఒక విజనరీ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రేవంత్‌రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి గొప్ప నేతగా విలసిల్లుతున్న కేసీఆర్ నీడను కూడా తాకలేరని స్పష్టంచేశారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా హీనమైన చరిత్ర మూటగట్టుకోవడం ఖాయమని పేర్కొన్నారు.