నిజామాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ పక్షికి భద్రత కరువైంది. జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వాగు ఆవాసంగా కుప్పలు తెప్పలుగా సంచరించేవి. ప్రస్తుతం వాగును ఆనుకొని నిర్మాణాలు చేపట్టడంతో నెమళ్లు ఆగమాగమవుతున్నాయి. ఫులాంగ్ వాగును డ్రైనేజీ డంప్‌గా మార్చడం కూడా జాతీయ పక్షి ఆయువు తీస్తోంది. ఇబ్బడి ముబ్బడి చర్యలతో నెమళ్లు తమ ఆవాసాలను కోల్పోతుండడంతో వాటి సంఖ్యలో రోజురోజుకూ తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు.
పూలాంగ్ వాగు వానాకాలంలో సువిశాలంగా ప్రవహిస్తుంది. నగరానికి అందమైన జల హారంగా కనిపిస్తుంది. జిల్లా కేంద్రానికి తూర్పు భాగమంతటినీ స్పృశిస్తూ పూలాంగ్ వాగు ఉత్తర దిక్కున ముందుకు కదులుతుంది. విశాలమైన ఈ వాగు దారి పొడవునా దట్టమైన చెట్లతో గతంలో కనిపించేది.
వివిధ కారణాల మూలంగా కళావిహీనంగా మారిన వాగుతో జాతీయ పక్షి సంచారానికి ప్రమాదం వచ్చి పడింది. నెమళ్ల సందడితో ఒకప్పుడు ఆహ్లాదానికి కేరాఫ్‌గా నిలిచిన పూలాంగ్ వాగు చుట్టూ పంట పొలాలు, నెమళ్ల కిలకిల రావాలు లేకపోవడంతో మూగబోతోంది. సాంకేతికంగా వాగుల పరిధి ఇరిగేషన్ శాఖకు చెందుతున్నప్పటికీ వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత అటవీ శాఖకు ఉన్నా పట్టించుకున్న దాఖాలాలులేవు. దీంతో నెమళ్ల సంతతికే ప్రమాదం ఏర్పడింది.
నెమళ్లపై అటవీ శాఖ నిర్లక్ష్యం
నెమలి భారతదేశ జాతీయ పక్షి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద సంరక్షిత జాతిగా గుర్తించారు. ఈ చట్టం ప్రకారం నెమలికి హాని కలిగించడం, వేటాడడం, బంధించడం, దాని ఈకలను వాణిజ్య అవసరాలకు కోసం ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 51(1ఏ) ప్రకారం నెమలికి హాని తలపెడితే శిక్షార్హమైన నేరం అవుతుంది. గరిష్ఠంగా ఏడేండ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా విధించే వీలుంది. నెమళ్లను అడవులు, అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాల్లో సంరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వివిధ కారణాలతో పూలాంగ్ వాగు వెంట నెమళ్ల ఆవాసాలు అనేకం ధ్వంసం కావడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పలు సందర్భాల్లో ఆవాసాలు లేక అనుమానితుల సంచారంతో బెదిరిపోతున్నాయి. దారి తప్పి గృహ నివాసాలపైకి వచ్చేస్తున్నాయి. వాగు వెంట అనేక కాలనీల్లో నెమళ్లు సంచరిస్తూ భద్రత లేకుండా పోతున్నాయి. నెమళ్లు ఫాసియోనిడే కుటుంబానికి చెందినవి. వైవిధ్యతలో అనేక ప్రత్యేకతలున్నాయి.
పురుష నెమళ్లు రంగురంగుల ఈకలు, పొడవైన తోకలతో ఆకర్షణీయంగా పూలాంగ్ వెంట విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆడ నెమళ్లు సాధారణ గోధుమ రంగు ఈకలతో నిరాడంబరంగా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ వైవిధ్యత సంతానోత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వీటి సంరక్షణకు చర్యలు లేకపోవడం, ఆవాసల విధ్వంసం మూలంగా ఈ వైవిధ్యతతకు ముప్పు ఉంది. నెమళ్లు భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉండగా అటవీ శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరువైన భద్రత
నిజామాబాద్ నగరం చుట్టూ పాంగ్రా వాగు, పులాంగ్ వాగులు సరిసమానంగా ప్రయాణం చేస్తాయి. నగరానికి ఆగ్నేయ దిక్కు నుంచి చొచ్చుకుని వస్తూ నగరానికి తూర్పు దిశగా జలహారంగా ఏర్పడి ఉత్తర వైపునకు దిశను మార్చుకుంటాయి. పాంగ్రా వాగు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత విజయ్ థియేటర్, ఎల్లమ్మగుట్ట సమీపంలోని మురికి నీటి శుద్ధి కేంద్రం వద్ద పులాంగ్ వాగుతో సంగమిస్తుంది. పూలాంగ్ వాగు ఇక్కడి నుంచి జన్నేపల్లి మీదుగా గోదావరిలో కలుస్తుంది. కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణం చేసే ఈ వాగు ఒకప్పుడు నెమళ్లకు రక్షిత కవచంగా ఉండేది.
రోజురోజుకూ నగరం విస్తరించడం, జనావాసాలు పెరగడంతో వ్యర్థాలు విపరీతంగా డంప్ కావడం, వాగు విస్తీర్ణం తగ్గిపోవడం, మానవ కార్యకలాపాలు పెరిగి వన్యప్రాణుల జీవనానికి ముప్పు ఏర్పడింది. రాత్రి వేళల్లో అనుకోని అలజడితో నెమళ్లు ఆగమాగమై అనేక కాలనీల్లో ఇండ్లపై వచ్చి వాలుతున్నాయి. తద్వారా రక్షిత ఆవాసాలు కోల్పోయి నెమళ్లకు భద్రత లేకుండా పోతోంది.
వాగు అవతలి వైపు ఏర్పడిన పలు వెంచర్లలో ఈ మధ్య కాలంలో కుక్కల దాడికి గురై నెమళ్లు బెదిరిపోతున్నట్లుగా చెబుతున్నారు. వ్యవసాయానికి, గ్రామీణ జీవనానికి కీలకమైన పులాంగ్, పాంగ్రా వాగులు ప్రస్తుతం నగరవాసులకు, నెమళ్లకు పెద్ద దిక్కుగానే నిలుస్తున్నాయి. మనిషి మనుగడకు ముప్పు లేకపోగా మూగ జీవాలకు ఏర్పడిన ఈ సమస్యను నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖలు సంయుక్త కార్యాచరణతో కాపాడాలని నగర ప్రజలు, వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.
నెమళ్ల భద్రతకు చర్యలు చేపడతాం..
జాతీయ పక్షి నెమళ్ల భద్రతపై తప్పకుండా సంరక్షణ చర్యలు చేపడతాం. ఫులాంగ్ వాగు వెంట నెమళ్ల గుడ్ల సంరక్షణ, నెమళ్ల సంచారానికి ఏర్పాట్లు చేస్తాం. త్వరలోనే ఫులాంగ్ వాగు వెంట సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తాం. జాతీయ పక్షిని వేటాడడం క్రూరమైన చర్య. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– వికాస్ మీనా, అటవీ శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా