ఖలీల్‌వాడి/ఇందల్వాయి/విద్యానగర్/రాజంపేట్, డిసెంబర్ 12 : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకుడు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేశ్ దత్ ఎక్కా సూచించారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్లలో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. మహేశ్ దత్ ఎక్కా మాట్లాడుతూ ఎన్నికల విధులు చట్టబద్ధతతో కూడుకొని ఉన్నందున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏమాత్రం తప్పిదానికి ఆస్కారం కల్పించినా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ ఓటరు జాబితా రూపకల్పన జరిగేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. 2023లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అందరి దృష్టి ఓటరు జాబితాపై కేంద్రీకృతమై ఉంటుందన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చొరవ చూపాలన్నారు. ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలని, తప్పులు లేకుండా నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ప్రజలు కూడా ఆన్లైన్లో ఓటరు జాబితాను పరిశీలించుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
సదరం డాటాతో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్‌గా నమోదు చేయాలని సూచించారు. ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు.
ఓటర్లు ఎవరైనా ఇతర ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే, ఆ ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్‌లో పేరును నమోదు చేసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే జాబితా నుంచి పేరును తొలగించాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతరుల అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను పకడ్బందీగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, జడ్పీ సీఈవో గోవింద్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎన్నికల అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను, కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.