ఖలీల్‌వాడి/కంఠేశ్వర్/కామారెడ్డి, ఫిబ్రవరి 27 : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల కంటే ఉపాధ్యాయులే ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 92.46 శాతం, కామారెడ్డిలో 93.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, పట్టభద్రుల స్థానానికి సంబంధించి నిజామాబాద్‌లో 76.72 శాతం, కామారెడ్డిలో 78.12 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నది. నిర్దేశిత గడువు సాయంత్రం 4 గంటలు ముగిసే సమయానికి చాలా చోట్ల ఓటర్లు లైన్లలో వేచి ఉన్నారు. దీంతో వారందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. వాటిని ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రతతో కరీంనగర్‌లోని రిసెప్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పటిష్ట ఏర్పాట్లు..
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ శాసనమండలి స్థానానికి నిర్వహించిన ఎన్నికలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులను భారీగా మోహరించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కామారెడ్డి జిల్లాలో 25, నిజామాబాద్‌లో 33 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 81 ఓటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. పలు కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహణను పరిశీలించారు.
ఓటేసేందుకు బారులు తీరిన టీచర్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు బారులు తీరారు. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం తర్వాత ఊపందుకున్నది. సాయంత్రం 4 గంటలకు గేట్లకు తాళాలు వేశారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు. అప్పటికే కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు లైన్లలో బారులు తీరారు. వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీకి మొత్తం 5,762 మంది ఓటర్లు ఉండగా, 93 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 47,984 మంది పట్టభద్రులుంటే, దాదాపు 80 శాతం మంది ఓటేశారు. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడం గమనార్హం. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, రాజీవ్‌గాంధీ హన్మంతు ఓటేశారు. కామారెడ్డిలోని బాలుర ఉర్దూ పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, లింగంపేట్‌లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్ఎస్ నేత రాంకిషన్‌రావు తదితరులు ఓటు వేశారు.
వీల్‌చైర్స్ లేక ఇక్కట్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్స్ అందుబాటులో లేక అవస్థలు పడ్డారు. ముబారక్‌నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ నడవలేని స్థితిలో ఉండగా, వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న పోలీసు సిబ్బంది ఇతరులతో కలిసి చేతులతో పట్టుకుని వెళ్లి ఓటు వేయించారు. పలుచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యాయని సమాచారం.
కామారెడ్డిలోనే అత్యధికంగా..
నిజామాబాద్ కన్నా కామారెడ్డిలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీచర్లు, పట్టభద్రులు భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్లు 78.12 శాతం, ఉపాధ్యాయులు 93.63 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లోని రిసెప్షన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలోని 173 వ పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి ఓటేశారు. పోలీసు బందోబస్తుపై ఎస్పీ సింధూశర్మ ఎప్పటికప్పుడు సమీక్షించారు. లింగంపేట్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఓటర్ల సహాయార్థం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన టెంట్ వద్ద జనాలు భారీగా గుమిగూడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేత రాంచందర్‌పై ఎలారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు చేయి చేసుకోవడం కలకలం రేపింది. భిక్కనూరులో టెంట్ తొలగింపుపై పోలీసులకు, బీజేపీ నేతలకు స్వల్ప వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టెంట్ తొలగిస్తేనే తాము తొలగిస్తామనడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.