కామారెడ్డి, మార్చి 25: కామారెడ్డిలో ఓ పసిగుడ్డును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో శిశువు విక్రయించిన ఉదంతం బయట పడింది. కామారెడ్డి పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో కొందరు గొడవ పడుతున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దీంతో పెట్రోలింగ్‌లో ఉన్న ఏఎస్సై రంగారావు, కానిస్టేబుల్ వెంకటేశ్ అక్కడకు చేరుకున్నారు. ఏం జరిగిందని విచారించగా, మగ శిశువు విక్రయించిన విషయం వెలుగు చూసింది.
దీంతో శిశు సంరక్షణ శాఖ అధికారులకు సమాచారమిచ్చి, దర్యాప్తు చేపట్టారు. క్యాసంపల్లికి చెందిన పల్లపు రాజమణి, నర్సింహులు దంపతులకు పుట్టిన శిశువును ఈ నెల 19న విక్రయించారు. మధ్యవర్తులు పిట్ల వెంకటి, రాములు సమక్షంలో సిరికొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు రూ.55 వేలకు పసిబిడ్డను కొనుగోలు చేశారు. అయితే, సోమవారం రాత్రి డబ్బు విషయంలో గొడవ జరిగింది.
దీనిపై సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పసిబిడ్డ విక్రయం వెలుగు చూసింది. విక్రయించిన బాబును స్వాధీనం చేసుకుని శిశుసంరక్షణ కేంద్రం నిర్వాహకులకు అప్పగించారు. శిశువును విక్రయించిన తల్లిదండ్రులతో పాటు కొనుగోలు చేసిన వారిపై, మధ్యవర్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి శిశువును కాపాడిన ఏస్సై రంగారావు, కానిస్టేబుల్ వెంకటేశ్, హోంగార్డు బాలరాజ్, ఏఆర్ పీసీ లక్ష్మణ్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం అభినందించారు.