వినాయక్‌నగర్, అక్టోబర్ 18 : పాత నేరస్తుడి చేతిలో హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిజామాబాద్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ బి.ప్రమోద్ను శుక్రవారం రాత్రి జిల్లాకేంద్రంలోని వినాయక్‌నగర్ ప్రాంతంలో పాత నేరస్థుడు షేక్ రియాజ్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు.
కానిస్టేబుల్ మృతదేహానికి శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబీకులకు అప్పగించారు. పీసీ ప్రమోద్ అంత్యక్రియలకు నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ న్యూబ్యాంక్ కాలనీలో ఉన్న స్వగృహంలో కానిస్టేబుల్ మృతదేహానికి ఐజీ, సీపీలతో పాటు సిబ్బంది నివాళులర్పించారు.
కానిస్టేబుల్ కుటుంబసభ్యులను ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. డిపార్ట్మెంట్ తరఫున వచ్చే అన్ని బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సైతం ఇప్పిస్తామని భరోసా కల్పించారు. నేరస్థుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య వెల్లడించారు. అంతిమయాత్రలో అడిషనల్ డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రారావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ట్రాఫిక్, సీటీసీ, సీసీఎస్ ఏసీపీలు, పోలీస్ సంఘం ప్రతిపనిధులు, తోటి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
నేరస్థుడి సమాచారం ఇచ్చిన వారికి రూ.50 వేల రివార్డు
కానిస్టేబుల్‌ను హత్య చేసిన నేరస్థుడు షేక్ రియాజ్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల క్యాష్ రివార్డు అందజేస్తామని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని ఖిల్లారోడ్డు ప్రాంతంలోని అహ్మద్పుర కాలనీకి చెందిన సదరు నేరస్థుడిపై దొంగతనాలు, దోపిడీ, హత్య కేసులు ఉన్నాయని, నేరస్థుడి ఆచూకీ తెలిసిన వారు డయల్ 100 లేదా 87126 59793, 87126 59777 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.