గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే మారిన గ్రామాల ముఖచిత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతున్నది. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లతో పల్లెల్లో పరిశుభ్రత, హరితహారం అమలుతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అభివృద్ధి బాటలో పయనిస్తున్న గ్రామాలు.. తీరొక్క మొక్కలు, చూడచక్కని వనాలతో పల్లెలకు కొత్త అందాలను తీసుకువచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని పల్లెలు పురోగతిలో పయనిస్తూ అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన హరితోత్సవంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ గ్రామాలు అవార్డులకు ఎంపికయ్యాయి. రెండు గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులను మంత్రులు ఘనంగా సత్కరించారు.
మోర్తాడ్, జూన్ 26: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం.. గ్రామస్తుల సహకారంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ అవార్డులను సొంతం చేసుకుంటున్నది మోర్తాడ్. ఇప్పటికే పల్లెప్రగతిలో ఉత్తమ మండలంగా మోర్తాడ్ ఎంపికై గత సంవత్సరం అవార్డును అందుకున్నది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభు త్వం హరితహారాన్ని విజయవంతం చేస్తున్న గ్రామాన్ని ఎంపిక చేసి ఉత్తమ సేవా పత్రాలను అందజేసింది. ఇం దులో కూడా మోర్తాడ్ సర్పంచ్ బోగ ధరణి, కార్యదర్శి రామకృష్ణ సేవా పత్రాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
మోర్తాడ్ మండలంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మండలంలో మోర్తా డ్ గ్రామం ఈ కార్యక్రమం అమలులో ముందున్నది. పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుతోపాటు గ్రీన్ చాలెంజ్ సందర్భంగా వెయ్యి మొక్కలు నాటడం, అవెన్యూ ప్లాంటేషన్‌ను సంరక్షించడం చేస్తున్నారు. పల్లెప్రకృతి వనాన్ని సందర్శించే ప్రజలు వ్యాయామం చేసుకునేలా పరికరాలను అమర్చారు. రహదారులకిరువైపులా మొక్కలు పెంచడంతో హరితతోరణాల్లా చెట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖాన, గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కాంప్లెక్స్‌లు కూడా హరితమయంగా ఉన్నాయి. నర్సరీల నిర్వహణ, ప్రకృతివనాల్లో నాటిన మొక్కలను సంరక్షించడంతో ప్రస్తుతం అటవీ ప్రాంతా ల్లా కనిపిస్తున్నాయి. అవెన్యూప్లాంటేషన్తోపాటు సెంట్రల్ లైటింగ్ డివైడర్లలో నాటిన మొక్కలకు కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది తరచూ నీళ్లు పట్టడం, వాటిని సంరక్షించడం, ఎంపీడీవో, కార్యదర్శుల పర్యవేక్షణ ఉండడంతో మోర్తాడ్ హరితమయంగా మారుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన హరితోత్సవంలో జిల్లా నుంచి హరితహారం కార్యక్రమానికి మోర్తాడ్ ఉత్తమ పంచాయతీగా ఎంపికవ్వడం, మంత్రుల చేతుల మీదుగా సేవా పత్రాలను అందుకోవడం సంతోషంగా ఉన్నది. మోర్తాడ్‌లో హరితహారం విజయవంతం కావడానికి అధికారులు, గ్రామస్తుల సహకారం ఉన్నది. ఇదే స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం.
– బోగ ధరణి, సర్పంచ్, మోర్తాడ్
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మా గ్రామ పంచాయతీలో తూచ తప్పకుండా అమలు చేస్తూ అభివృద్ధిలో పోటీ పడుతున్నాం. పల్లె ప్రకృతి వనంలో 5వేల మొక్కలు నాటి పెంచుతున్నాం. గ్రామంలో ఇప్పటి వరకు లక్ష మొక్కలను నాటాం. రోడ్డుకు ఇరువైపులా చెట్లకు ప్రముఖుల చిత్రాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాలపై వాల్ పెయింటింగ్ చేశాం. పాలకవర్గం, ప్రజల సహకారంతో అభివృద్ధిలో ముందుంటున్నాం.
– బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, సదాశివనగర్
ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నాం. హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం. గ్రామం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్నది. హరితహారంలో ఉత్తమ సేవలందించినందుకు సదాశివనగర్ గ్రామ పంచాయతీకి అవార్డు రావడం గర్వకారణం. అందరి కృషితోనే అవార్డు వచ్చింది.
– సురేందర్‌రెడ్డి, ఎంపీవో, సదాశివనగర్