బోధన్, నవంబర్ 28: ఏడేండ్ల కిందటి వరకు జిల్లా సరిహద్దులో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. జిల్లాలోని సరిహద్దు గ్రామాల నుంచి రైతులు తమ ధాన్యాన్ని మర పట్టించి, బియ్యాన్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఎందుకంటే ఇక్కడి ధాన్యానికి అప్పట్లో మద్దతు ధర లభించేది కాదు. సమైక్య రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరిగేవీ కావు. రైస్‌మిల్లర్లు, దళారులు రైతులకు సరైన ధర ఇవ్వకుండా దోచుకునేవారు. ఇక్కడ ఇలా ఉంటే.. వరి పంట తక్కువగా పండే మహారాష్ట్రలో మన బియ్యానికి డిమాండ్ ఎక్కువ ఉండేది. ధాన్యానికి మద్దతు ధర కోసం ఇక్కడి రైతులు చాటుగా బియ్యాన్ని సరిహద్దు దాటించి మహారాష్ట్ర వ్యాపారుల కాంటాల వద్ద అమ్ముకునేవారు. ఇక్కడి కన్నా అక్కడ ఎంతో కొంత మెరుగైన ధర లభించేది. ఈ క్రమంలో నాటి పాలనావ్యవస్థలోని అధికారులు ఇలా బియ్యాన్ని తరలిస్తున్న రైతులను పట్టుకున్న సందర్భాలు అనేకం. వారిపై కేసులు కూడా నమోదు చేసిన సంఘటనలు లేకపోలేదు.
ఇప్పుడా సీన్ రివర్సయ్యింది.. తెలంగాణ ఆవిర్భావం.. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం.. తెలంగాణ రైతుల కష్టనష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ సీఎం కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఏడేండ్లలో మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడడం, ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు అందడం, 24 గంటల ఉచిత విద్యుత్… పెట్టుబడుల కోసం రాష్ట్రం ప్రభుత్వం ‘రైతుబంధు’ ఇస్తుండడంతో.. జిల్లాలో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. సాగునీరు, విద్యుత్‌కు కొరత లేకపోవడంతో జిల్లా అంతటా విస్తారంగా వరి సాగవుతూ వచ్చింది. కొన్నేండ్లుగా ధాన్యం సిరులతో జిల్లా కళకళలాడుతోంది. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడంతోపాటు మద్దతు ధరను వెంటనే చెల్లిస్తున్నది. ప్రస్తుత సీజన్లో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై గందరగోళ పరిస్థితికి తెరలేపింది. ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పడేలా చేసి, క్లిష్టపరిస్థితుల మధ్య కూడా జోరుగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నది. ఈ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో సుమారు 70వేల మంది రైతుల నుంచి 5లక్షల20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీంతో ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పుడు లేకుండాపోయాయి.
‘మహా’ రైతుల ప్రయత్నాలు..
తెలంగాణ ఆవిర్భావానికి ముందు మన రైతులు అష్టకష్టాలు పడి సాగుచేసినప్పటికీ తగిన లాభం వచ్చేది కాదు. ఆ కొద్దిపాటి ధాన్యాన్ని అయినా సరైన ధరకు అమ్ముకోవడానికి మహారాష్ట్ర వైపు చూసే దుస్థితి మన సరిహద్దు రైతులది. ధాన్యాన్ని అక్కడికి బియ్యం రూపంలో తరలించి ఎంతో కొంత గిట్టుబాటును పొందేవారు. రైతుకు ఇప్పుడా కష్టాలు లేవు. ఇక్కడ పంట అమ్మకాలకు గ్యారంటీ ఏర్పడడం, ప్రభుత్వం జోరుగా కొనుగోళ్లు చేస్తుండడంతో సరిహద్దులో ఉన్న నాందెడ్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని ఇక్కడికి తెచ్చి.. ఏదో రకంగా అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అక్కడి రైతులు కందులను చాటుగా ఇక్కడికి తరలించి, కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడి రైతుల పేరిట విక్రయించిన ఉదంతాలు బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. అదే మాదిరిగా ఇప్పుడు ధాన్యాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన పౌర సరఫరాలశాఖ అప్రమత్తమయ్యింది.
చెక్‌పోస్టుల ఏర్పాటు..
ప్రస్తుతం కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో జిల్లాలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తున్నది. ఈ పరిస్థితుల్లో బయటి రాష్ట్రం ధాన్యం కూడా ఇక్కడికి వస్తే.. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదమున్నది. ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోళ్లే తలకుమించిన భారమయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తున్నది. ఇక బయటి ధాన్యం మార్కెట్లోకి, దొంగచాటుగా ఇక్కడివారి పేరిట కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చే అవకాశాలను అంచనా వేసిన అధికారులు సరిహద్దులో నిఘా పెట్టారు. జిల్లాను ఆనుకొని ఉన్న సరిహద్దులో మహారాష్ట్రలోని ధాన్యం లారీలు, వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి రాష్ట్రంలోకి ధాన్యం రవాణా జరగకుండా బోధన్ మండలం సాలూరా, రెంజల్ మండలం కందకుర్తి, కోటగిరి మండలం పొతంగల్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టులన్నీ శనివారం నుంచి పనిచేస్తున్నాయి. ఈ చెక్‌పోస్టుల్లో అధికారులు విడుతల వారీగా 24 గంటలపాటు మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల కోసం వీఆర్వోలు, వీఆర్ఏలు, పోలీస్ కానిస్టేబుళ్లను నియమించారు. చెక్‌పోస్టుల ఏర్పాటుతో అక్రమంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ధాన్యానికి కళ్లెం పడనున్నది.