నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా పోలీస్ బాస్‌లకు స్థానచలనం కలిగింది. ఇద్దరిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయాలని బుధవారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు కలెక్టర్లు, 13 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు, సీపీలను సీఈసీ బదిలీ చేయగా, అందులో నిజామాబాద్ సీపీ, కామారెడ్డి కలెక్టర్ సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బదిలీ నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాలేదు.
సెప్టెంబర్ 1వ తేదీన ఆయన సీపీగా నియమితులు కాగా, తాజాగా ఆయనకు స్థానచలనం కల్పిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని సైతం బదిలీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించలేదు. వారికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చేది వెల్లడించలేదు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రతిపాదించే ఐపీఎస్ అధికారుల జాబితాను అనుసరించి సీపీ, ఎస్పీల నియామకాన్ని ఈసీ ఖరారు చేయనున్నట్లు తెలిసింది. సరిగ్గా 41 రోజుల పాటు నిజామాబాద్ సీపీగా పని చేసిన సత్యానారాయణ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.
అనతి కాలంలోనే గంజాయి రవాణాదారులకు చుక్కలు చూపించారు. రౌడీషీటర్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి వారిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను సవ్యంగా కాపాడేందుకు, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికలను సైతం సిద్ధం చేశారు. ఇంతలోనే ఈసీ ఆయనను ట్రాన్స్ఫర్ చేసింది.