రాజంపేట్, నవంబర్ 7: ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి అందించాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీడీకార్మికులు మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ అనిల్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు మాట్లాడుతూ.. పదిహేను రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో వేలాదిమంది బీడీ కార్మికులు జీవనభృతి చెల్లించాలని ఆందోళన చేస్తుంటే, స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి ఇవ్వాలని లేనిపక్షంలో స్థానిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, ఏఐఎఫ్టీయూ శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులు నాంపల్లి, బీడీ టేకేదార్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం భాస్కర్, పంచాక్షరి, నాంపల్లి బాలకిషన్, బీడీ కార్మికులు పాల్గొన్నారు.