ఖలీల్‌వాడి, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026లో మైనార్టీలకు పూర్తిగా మొండిచేయి చూపిందని పలువురు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నవీద్ ఇక్బాల్, టౌన్ అధ్యక్షుడు ఇమ్రాన్ షెహబాద్ పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు.
వాటిలో ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. రూ.4వేల కోట్ల సబ్‌ప్లాన్, నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు రూ.వెయ్యి కోట్లు, అబ్దుల్ కలాం విద్యా పథకం ద్వారా స్కాలర్షిప్లు, ఇమామ్‌లు,మౌజన్లకు వేతనాలు, వక్ఫ్ భూముల రక్షణ, కబ్రస్తాన్ల అభివృద్ధి వంటి కీలక హామీల అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026-27లో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడం, మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ భూములపై నోటీసులు ఇవ్వడం, హజ్ రబాత్ నిర్మాణంలో ఆలస్యం అనేవి ప్రభుత్వనిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రస్తుత రెండు సంవత్సరాల పాలనలోనే అనేక సామాజిక ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, వాటిపై సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చేవారని, రంజాన్ తోఫా అందించేవారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఏ ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, నిధులను మాత్రం వృథా చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఇమ్రాన్ షెహజాద్, మహ్మద్ మతీన్, అబ్దుల్ బారీ, సనా ఉల్లాఖాన్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ సమీ, అబ్దుల్ అజీజ్, మజారుద్దీన్, తజ్జముల్ఖాన్, మహ్మద్ హఫీజ్, నయీబ్ ఖురేషి, మహ్మద్ ఇంతియాజ్, యూనిస్, మహ్మద్ ఆరిఫ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.