రాష్ట్ర ప్రభుత్వం బీడీ టేకేదార్లకు తీపికబురు అందించింది. బీడీ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోద ముద్రవేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడీ టేకేదార్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 5వేలకు పైగా బీడీ టేకేదార్లకు లబ్ధి చేకూరనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను గుర్తించి జీవనభృతితో ఆసరా కల్పించారని బీడీ టేకేదార్లు సంబురపడుతున్నారు.
కామారెడ్డి, జూలై 31 (నమస్తే తెలంగాణ): పేదలందరికీ గౌరవంగా, సురక్షితమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను ప్రవేశపెట్టారు. గౌరవప్రదమైన, సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడిపేందుకు రోజూవారీ కనీస అవసరాలు తీర్చుకునేలా ఈ పథకం ఉపయోగపడుతుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తూ సంక్షేమ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా బీడీ టేకేదార్లకు మరింత ఆసరా కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు 5వేల మందికి పైగా టేకేదార్లకు లబ్ధి చేకూరనున్నది.
బీడీ పరిశ్రమకు ఉమ్మడి జిల్లా ప్రసిద్ధి..
తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికులకు ప్రసిద్ధి. ఇక్కడ బీడీలు చేస్తూ, జీవనోపాధిని పొందుతున్న మహిళలు వేలల్లో ఉన్నారు. అయితే వీరి శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడంతో సీఎం కేసీఆర్ రూ.2016 ఫించన్ ఇస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు. తాజాగా బీడీ కార్మికులతోపాటు కార్ఖానాలను నడుపుతున్న టేకేదార్లకూ ఫించన్ ఇస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో వారి జీవితాల్లో వెలుగు నింపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 5వేల వరకు టేకేదార్లు ఉన్నారు. బీడీ కంపెనీల యాజమాన్యాలు కేవలం బీడీలు చుట్టే కార్మికులు, టేకేదార్లకు నామమాత్రపు కూలీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. అయితే వారి కష్టాన్ని గుర్తించిన కేసీఆర్, బీడీ కార్మికులు, టేకేదార్లను ఆదుకోవడం తమ విధిగా భావించి పింఛన్‌ను అందించడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో బీడీ కార్మికులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 11,559 మంది, బాన్సువాడ నియోజకవర్గంలో 2207, జుక్కల్ నియోజకవర్గంలో 600, కామారెడ్డి నియోజకవర్గంలో 22,592 మంది ఉండగా, వారికి రూ.2,016 చొప్పున పింఛన్ ఇస్తున్నారు.
కేసీఆర్ మా కష్టాన్ని గుర్తించిండు..
మానాన్న తర్వాత నేను బీడీ టేకేదార్‌గా పనిచేస్తున్న. ఎన్నో సంవత్సరాల నుంచి టేకేదార్ల సమస్యను నాయకులు పట్టించుకోలేదు. మా కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ మాకు పింఛన్ ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ నిర్ణయంతో చాలా కుటుంబాలకు భరోసా ఇచ్చినైట్లెంది. మేమందరం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-బండారి మధు, టేకేదార్, భీమ్‌గల్
సంతోషంగా ఉన్నది..
బీడీ టేకేదార్లకు పింఛన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉన్నది. ఇంతకుముందు మాకు చేతినిండా పనిలేదు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. పింఛన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నది. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– ఎట్టేం శ్రీనివాస్ యాదవ్, బీడీ టేకేదార్, ఏర్గట్ల.
మాకల నిజమైంది
మోర్తాడ్, జూలై 31: టేకేదార్ల బాధలు ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సాబ్ చెప్పిండు మాక్కూడా పింఛన్ ఇస్తమని. ఆ కల ఇయ్యాల్ల నిజమైంది. మేమెప్పుడు కూడా అనుకోలేదు. మాక్కూడా పింఛన్ వస్తదని, కానీ సార్ జెప్పినంక నమ్మకం వచ్చింది. మాచిన్న బతుకులను ఆదుకునేందుకు పింఛన్ వస్తదని. ఏండ్ల నుంచి కష్టపడుతున్న మా బతుకులకు కేసీఆర్ సార్ న్యాయం జేసిండనిపిస్తుంది. సార్‌కు మేము రుణపడి ఉంటాం.
– రహీం, టేకేదార్, చౌట్పల్లి
టేకేదార్లకు భరోసా కల్పించారు
దోమకొండ, జూలై 31: ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ టేకేదార్లకు భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. బీడీ టేకేదార్లకు కంపెనీల తరఫున ఎలాంటి ఆసరా లేదు. కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటాం. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
– మంగళ్పెళ్లి దేవదాస్, బీఆర్ఎస్ కార్మిక విభాగం టేకేదార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఏ ప్రభుత్వాలూ టేకేదార్ల సమస్యలను పట్టించుకోలేదు. మా బాధలను కేసీఆర్ అర్థం చేసుకొని జీవనభృతి ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. కేసీఆర్ పాలన అభినందనీయం.
– చౌకి దశరథం, టేకేదార్ల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
ఎంతో రుణపడి ఉంటాం
ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తున్నారు. పాలకులు మారినా ఏండ్లుగా బీడీ టేకేదార్లకు ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా సాయం అందలేదు. సీఎం కేసీఆర్ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వడం హర్షణీయం. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం.
– అల్వాల శ్రీనివాస్, టేకేదార్ల సంఘం మండలాధ్యక్షుడు
మా కష్టాన్ని గుర్తించారు..
ఏండ్లుగా బీడీ టేకేదారుగా పనిచేస్తున్నా. బీడీ కంపెనీ ఇచ్చే నయానో బయానో కమీషన్‌పై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ప్రతినెలా సరైన వేతనాలు అంటూలేవు. ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా బీడీ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాం. జీవనభృతితో మా జీవితాల్లో వెలుగులు నింపారు.
– గాలి నారాయణ టేకేదారు, చిన్నమల్లారెడ్డి
ఎంతో సంతోషంగా ఉన్నది..
బీడీ టేకేదార్లకు సీఎం కేసీఆర్ జీవనభృతి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మాకంటూ జీవనభృతితో ధైర్యాన్ని నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు జీవితంలో మరిచిపోలేం. కేబినెట్లో బీడీ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వాలని నిర్ణయించడం ఆనందంగా ఉన్నది.
– సిరిగాద మహదేవ్, బీడీ టేకేదారు దోమకొండ