డోంగ్లీ, జూన్ 5: వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులంతా ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇలాగే సాగు చేస్తే భూమిలోని సారం తగ్గి.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి పంటల మార్పిడి విధానాన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకేరకం పంటలు సాగు చేస్తే భూసారం తగ్గడంతోపాటు రోగాలు కలిగించే పురుగుల సంఖ్య పెరిగి దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. పంటల మార్పిడితో భూమిలోని పోషకాలు మొక్కలకు సమృద్ధిగా అందుతాయని పేర్కొంటున్నారు.
ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా సాగు చేస్తే చీడపీడలు ఉధృతి అధికమవుతాయి.
పురుగు జీవిత చక్రం పూర్తి చేసుకొని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది.
పంట మార్పిడి చేస్తే ఒక పంటపై ఆశించే పురుగు మరో పంటను ఆశించవు.
వేగంగా వృద్ధిచెందే కొన్నిరకాల పురుగులు పంట మార్పిడితో అదుపులో పెట్టొచ్చు.
వరి, వేరుశనగ, మక్క, జొన్న తదితర పంటల పైర్లు నేలపై పొరల నుంచి పోషకాలు తీసుకుంటాయి.
నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండేందుకు చీడపీడల అభివృద్ధిని నిరోధించేందుకు పంట మార్పిడి తప్పకుండా చేయాలి.
అప్పుడప్పుడు పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి.
వరి తర్వాత మినుము, పెసర, శనగ వేస్తే సుడి దోమ, టుంగ్రో వైరస్ను నివారించొచ్చు.
చెరుకు తర్వాత వరి వేస్తే వేరు పురుగు తగ్గించవచ్చు. వరిలో దోమపోటు నివారించవచ్చు.
పత్తి వేసిన పొలంలో జొన్న, మక్క, నువ్వులు, మినుములు వేస్తే లద్దె పురుగు, పచ్చ పురుగులను నిర్మూలించవచ్చు.
వరి సాగు చేసే పొలంలో ముందుగా పప్పుధాన్యాలు సాగు చేస్తే నేల సారవంతమవుతుంది.
జొన్న, మక్క తర్వాత కంది సాగు చేస్తే కాయతొలుచు పురుగుల ఉధృతి తగ్గుతుంది.
వేరుశనగలో ఆకుముడతను నివారించేందుకు పప్పు జాతికి చెందిన పైర్లు వేయాలి.
కంది,మిరప పంటల్లో ఎండు తెగుళ్ల నివారణకు జొన్న, మక్క సాగు చేయాలి.
నులి పురుగు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పైర్లు సాగును కొన్ని పంటకాలాల వరకు ఆపాలి.
ఆహార పంటలైన వరి, జొన్న, మక్క, సజ్జ, పప్పు జాతి పంటలైన మినుము, వేరుశనగ సాగుతో పంట మార్పిడి చేయాలి.
ఆహార, వాణిజ్య పంటలను పశుగ్రాసం పైర్లతో మరోసారి మార్పిడి చేస్తే లాభాదాయకంగా ఉంటుంది.
రైతులు ఒకే రకమైన పంటలు సాగుచేయడం ద్వారా ఆ మొక్కలకు అవసరమైన పోషకాలు లభించవు. రోగకారక పురుగులు వృద్ధి చెంది దిగుబడి తగ్గుతుంది. వరుసగా ఒకే పంటను కాకుండా వివిధ రకాల పంటల సాగుతో పురుగుల జీవిత చక్రాన్ని నిలిపేయవచ్చు. దీంతో మంచి లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది. రైతులు ఒకే రకమైన పంటల సాగుకు స్వస్తి చెప్పి పంట మార్పిడి విధానానికి శ్రీకారం చుడితే అధిక ఆదాయం సాధించే వీలున్నది.