బాన్సువాడ/బోధన్, ఆగస్టు 16: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలు, మందుల కొరత, వైద్యుల నియామకం తదితర అంశాలను ప్రభుత్వాకి నివేదించి పరిష్కారం కోసం కృషి చేస్తానని వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దవాఖానల నోడల్ అధికారి అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడ, బోధన్ దవాఖానలను తనిఖీ చేశారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లోని సమస్యలు, రోగుల ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో వైద్య శాఖ కమిషనర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా బాన్సువాడ దవాఖానలోని అన్ని వార్డులను పరిశీలించారు. పిల్లల వార్డులో ఒక్కోబెడ్పై ఇద్దరు చిన్నారులను పడుకోబెట్టి ఉండడం గమనించారు.
అనంతరం రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో వార్డులను పరిశీలించిన అనంతరం, దవాఖాన అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దవాఖానల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపా రు. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కమిషనర్‌కు సిబ్బంది వినతిపత్రం అందజేశారు.