నిజామాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడేళ్ల తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పూర్తి స్థాయి పాలకవర్గం సమావేశం కాబోతోంది. సోమవారం(ఆగస్టు 24న) హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ యూనివర్సిటీలో కీలకమైన అంశాలు అనేకం పాలకవర్గంలో చర్చించాల్సి ఉంది. టీయూకు శాశ్వత వీసీ నియామకమైనప్పటికీ ఈసీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వీసీ వచ్చిన తర్వాత పాలకవర్గ సమావేశాలు జరిగాయి. కానీ అవేవి పూర్తి స్థాయి సమావేశాలు కావు.
2024, ఫిబ్రవరిలో టీయూ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. రెండున్నరేళ్ల తర్వాత తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991లోని సెక్షన్ 18(1) అనుసరించి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వుల జారీ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 16, 2026న పూర్తి స్థాయి పాలకవర్గం ఏర్పాటైంది. రాజకీయ ప్రభావిత వ్యక్తులకు సభ్యులుగా చోటు కల్పించిన ఈ కమిటీ గడిచిన నాలుగు నెలలుగా ఎలాంటి మీటింగ్ నిర్వహించలేదు. ఈసీ ఏర్పాటు తర్వాత మర్యాదపూర్వకంగా తెలంగాణ యూనివర్సిటీలో భేటీ జరిగింది. అందులో ఎలాంటి ఎజెండా చర్చించలేదు. అధికారికంగా నేడు హైదరాబాద్లో నిర్వహిస్తోన్న కొత్త కమిటీ నేతృత్వంలోని తొలి ఈసీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉత్కంఠకు దారి తీస్తోంది.
పాలకవర్గం భేటీపై తెలంగాణ యూనివర్సిటీ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఈసీ భేటీకి సంబంధించి ఎలాంటి సమాచారం ప్రజలు, విద్యార్థుల ముందు పెట్టలేదు. అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. గతంలో పాలకవర్గం సమావేశాలపై అధికారికంగా టీయూ సంబంధీకులే వివరాలు వెల్లడించేది. కానిప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాలవవర్గ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలు సైతం బహిర్గతం చేయకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధానంగా టీయూ బడ్జెట్, ఏడాదిన్నర కాలంగా యూనివర్సిటీలో చోటు చేసుకున్న అంతర్గత ఘటనలు, పదోన్నతుల అంశాలతో పాటుగా ఇతర కీలక విషయాలను చర్చించే వీలుంది. మూడేళ్లుగా పూర్తి స్థాయి ఈసీ మీటింగ్ లేకపోవడంతో అనేక కీలక నిర్ణయాలపై నిర్ణయాలు లేకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పడి ఉంది. రిజిస్ట్రార్ మార్పుపైనా ఈసీ భేటీలో చర్చించే వీలున్నట్లుగా తెలుస్తోంది. ఏళ్లుగా ఒకే వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంపై పలువురు ప్రొఫెసర్లు గుర్రుమంటున్నారు. ఈ మధ్యనే ఎస్సీ కమిషన్కు కొంత మంది ఫిర్యాదు చేశారు. 2014 నియామకాలపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయగా విచారణ సైతం జరిగింది. ఇంతటి చిక్కుముడుల మధ్యలో ఈసీ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.