నందిపేట్, ఫిబ్రవరి 11 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంతో మరో ఘన చరిత్ర సృష్టించిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నా రు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో చే పల పెంపకంపై మాట్లాడారు. చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. చేపలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగడం హర్షణీయమన్నారు. సహజ నీటి వనరుల్లో చేపల పెంపకంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2014కు ముందు మత్స్య రంగం పూర్తి నిరాదరణకు గురైందని గుర్తుచేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగు నింపాలనే గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం చేపట్టారని వివరించారు. పూర్తిగా ధ్వంసమైన చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం వంటి నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
2014కు ముందు 1.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద 4లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. మత్స్యకారులు తక్కువ ధరకే చేపలు అమ్ముకోకుండా వాహనాలతో పాటు ఫిష్ట్ అవుట్లెట్ వాహనాలను సబ్సిడీపై సమకూర్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాకాలను వినియోగించుకుని ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలని మత్స్యకారులకు సూచించారు. ప్రతి యేటా జూన్ 7, 8, 9వ తేదీల్లో జిల్లాలోని మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలకు పరిచయం చేయాలనుకోవడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్న నాయకులు కూడా మనం పెంచిన చేపలు తింటున్నారని అన్నారు. ఉట్టి పడుతున్న జలకళతో కులవృత్తులకు ప్రాణం వచ్చిందని, దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని సీఎం కేసీఆరే అని తెలిపారు. గ్రామగ్రామాన చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని, చేపల ఉత్పిత్తికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైనా విపక్షాలు విమర్శలు మానాలని జీవన్‌రెడ్డి సూచించారు.