డిచ్పల్ల్లి/ భిక్కనూర్, ఏప్రిల్ 10 : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన వివిధ వర్సిటీల అకడమిక్ కన్సల్టెంట్లను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ, భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో అధ్యాపకులు గురువారం ఆందోళన చేపట్టారు. టీయూలో అకడమిక్ కన్సల్టెంట్లు క్యాంపస్‌లోని తరగతులు బహిష్కరించారు.
అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి బైఠాయించి నిరసన, ధర్నా నిర్వహించారు. భిక్కనూర్‌లోని సౌత్ క్యాంపస్‌లో బంద్ పాటించారు. ఈ సందర్భంగా వర్సిటీ కో- ఆర్డినేషన్ కమిటీ నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన వర్సిటీ అధ్యాపకులను అరెస్టు చేసిన రోజును తాము చీకటి దినంగా భావిస్తున్నామన్నారు.
ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏడో పీఆర్సీని అమలుచేయాలని కోరారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్స్ యాలాద్రి, సునీత, రమాదేవి, నర్సయ్య, ఏపీఆర్వో సరిత, నిరంజన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.