కామారెడ్డి, ఆగస్టు 21: మారుమూల ప్రాంతమైన గాంధారి ప్రాంతంలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వినూత్న రీతిలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ఎనిమిదేండ్లుగా విశేష కృషి చేస్తున్న బొంపల్లి భవానీ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. గాంధారిలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమెను కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.
వినూత్న రీతిలో పాఠాలు బోధించడమే కాకుండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించిన భవానీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన భవానీకి కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.