వినాయక్‌నగర్, మార్చి 3 : నిజామాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేయడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. సబ్ రిజిస్ట్రారు -2 గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీరామరాజు తన వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఫైల్స్ ముందుకు కదలాలంటే ఆయన డిమాండ్ చేసినంత ముట్టజెప్పాల్సిందేననే ప్రచా రం ఉంది. ఈ క్రమంలో నిజామాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం కొన్నిరోజుల క్రితం కార్యాలయానికి వెళ్లగా..
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగాలంటే తనకు రూ. 10 వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు రూ.10 వేలు లంచం ఇచ్చేందుకు సోమవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. లంచం డబ్బులను కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేసే ఆర్.వెంకట్రావుకు ఇవ్వాలని రిజిస్ట్రార్ సూచించగా.. బాధితుడు స్వీపర్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. లంచం డబ్బులతో సబ్ రిజిస్ట్రార్-2 శ్రీరామరాజుతోపాటు స్వీపర్ వెంకట్రావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వారిని నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.
సబ్ రిజిస్ట్రారు -2 శ్రీరామారాజు ఇంటిపై కూడా దాడి చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఆయన ఇంటిపై మధ్యాహ్నం దాడి నిర్వహించిన అధికారులు, రాత్రి వరకు సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.