శక్కర్ నగర్: జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం(NFBS )నకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ వేరువేరు ప్రకటనలో సూచించారు. కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం కింద 20 వేల రూపాయలు ఆర్థిక సాయం అందుతుందని వారు వెల్లడించారు.
ఇందుకుగాను మృతి చెందిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, లబ్ధి పొందే వారసుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కుల, ఆదాయ ధ్రువపత్రాలను జతపరిచి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. ఈ దరఖాస్తులను విచారణ అనంతరం అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడంతో ఈ పథకానికి చెందిన డబ్బులు వారి అకౌంట్లో జమవుతాయని సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు. అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.