వినాయక్‌నగర్, జూన్ 22: నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ అర్వింద్ ఇంటిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫలితాలు అస్తవ్యస్తంగా వచ్చాయని ఆరోపించారు. ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి గౌతం, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి, జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్ పాల్గొన్నారు.