విద్యార్థులు టీనేజీ అంటేనే ప్రేమ అని అనుకుంటారు. తల్లిదండ్రులకు తెలియనంతవరకు ఏండ్ల తరబడి ప్రేమించుకుంటారు. ఒకవేళ తెలిస్తే కన్నవారిని ఎదిరించే ప్రయత్నం చేస్తారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే పెండ్లి కూడా చేసుకుంటారు. కానీ సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ హుందాగా బతుకుతూ నలుగురికి ఆదర్శంగా నిలబడినప్పుడే ప్రేమకు సార్థకత లభిస్తుంది. అందరినీ కాదని పెండ్లి చేసుకున్న జంటలకు ఆర్థిక భరోసా ప్రధానం. లేదంటే ఆ కాపురాలు ఎక్కువరోజులు నిలబడవు. డబ్బు లేకపోతే ఒక్కోసారి ప్రేమ, జీవితం అనేవి వృథా అనిపిస్తుంది. కట్టుకున్నవారికి దూరం కావాల్సి వస్తుంది. ఇద్దరిలోనూ పట్టుదల, కష్టపడే తత్వం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాలను పంచుకున్నప్పుడు ప్రతిరోజూ వాలంటెన్స్డేనే. అదే నిజమైన ప్రేమ.
డిచ్పల్లి, ఫిబ్రవరి 13 : ప్రేమంటే రెండక్షరాల కలయిక కాదు. ప్రేమంటే రెండు హృదయాల కలయిక. ప్రేమ అనేది అనిర్వచనీయం. ప్రేమను ఒక్కమాటలో చెప్పలేము. మాటల్లో వివరించలేము. ఎంత చెప్పినా అది తక్కువే… అలాంటి ప్రేమ నేడు ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా యుక్తవయస్సులో కలిగేది ఆకర్షణా? లేదా నిజమైన ప్రేమనా అనే క్లారిటీ లేక యువత తికమక పడుతుంది. ఒకవేళ అది ఆకర్షణ అయితే ఆ బంధం విడిపోవడానికి కొద్దిరోజుల సమయమే పడుతుంది. నిజమైన ప్రేమ అయితే అది పెద్దలను ఒప్పించి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ప్రతిరోజూ మోసపోయిన ప్రేమికుల గురించి వింటున్నాం. ఇవన్నీ చూస్తూ జెట్స్పీడ్తో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో ప్రేమలు ఇంకా ఉన్నాయా అనిపిస్తుంది. కాలేజీ వయస్సులో యువతీ యువకులకు ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టడం సర్వసాధారణం. అది చివరి వరకు నిలబెట్టుకోవడంతోపాటు పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకుని సుఖసంతోషాలతో జీవిస్తున్న జంటలు మనకు అరుదుగా కనిపిస్తాయి.
యుక్త వయస్సుకు వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారు చెడుదారిలోకి వెళ్లకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలతో చనువుగా ఉంటూ ప్రేమ, ఆకర్షణకు తేడా అర్థమయ్యేలా వివరించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకోవడానికి కళాశాలలకు వెళుతున్నారని అనుకుంటారు. కానొ కొందరు స్పెషల్ క్లాసులు, ట్యూషన్లనీ ఇంటినుంచి వెళ్లి ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనవుతున్నారు. దీనిని తల్లిదండ్రులు గ్రహించి మంచి భవిష్యత్తుపై అవగాహన కల్పించాలి. లేదంటే ఆల్లారుముద్దుగా పెంచిన పిల్లలు తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకునే అవకాశం ఉంది.
మేము 2013లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. నేను బైక్ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పొషిస్తున్నా. నేను అతిగా ప్రేమించే నా భార్య ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. నాకు, పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడుతుంది. కష్టసుఖాలను పంచుకుంటూ కలిసిమెలిసి ముందుకు సాగుతున్నాం.