సిరికొండ : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసించాలని, చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిజామాబాద్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ ( Intelligence DSP ) సంగెం మధుసూదన్ అన్నారు. గురువారం సిరికొండలోని సత్యశోధక్( Satya Sodak Shcool ) పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థులు తమలోని బలం, బలహీనతలను తెలుసుకొని వాటిని మెరుగు పరుచుకోవడానికి కృషి చేయాలని అన్నారు. తమ సామర్థ్యాలకు అనుగుణంగా, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. నిరంతరం లక్ష్య సాధనకు మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని వివరించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ( Abdul Kalam ) చెప్పినట్లుగా ‘ కలలు కనండి. కష్టపడండి. వాటిని సాకారం చేసుకోవాలని పేర్కొన్నారు.
కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ లేదన్నారు. పేదరికం, సమస్యలు భవిష్యత్‌కు ఆటంకాలు కావని అన్నారు. సృష్టి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తుందని, ఎవరూ ఎక్కువగా కష్టపడితే వారికి మంచి ఫలితం, ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని డీఎస్పీ అన్నారు.
విద్యార్థి దశ అత్యంత కీలక మైనదని , మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొంటూ పట్టుదలతో సాధన చేసి విజయం సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య డీఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, శంకర్, గంగారామ్ సింగ్ , విద్యార్ధులు పాల్గొన్నారు.