సారంగాపూర్, ఏప్రిల్ 4 : ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపట్టినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ రూరల్ మండల తహసీల్దార్ అనిరుధ్ హెచ్చరించారు. గుండారం గ్రామంలో మొరం తవ్వకాల నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రికంలో ‘మొరం అక్రమ తవ్వకాలకు వేలం’ శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహసీల్దార్ గిర్దావర్ హరీశ్‌రెడ్డితో కలిసి గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.
పంచాయతీ కార్యాలయంలో వీడీసీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సభ్యులు దాసరి ఒడ్డెన్న, శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. మొరం అక్రమ తవ్వకాలకు వేలం వేసే హక్కు వీడీసీకి ఎక్కడిదని ప్రశ్నించారు. వేలం వేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇందుకు వీడీసీ ప్రతినిధులు స్పందిస్తూ పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల రాత్రివేళ మొరం అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను కొందరు అడ్డుకుని వీడీసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.
మొరం దందా చేసేవారిని జీపీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడినట్లు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. మొరం అక్రమంగా తరలిస్తే రూ.2.50 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించడం తప్ప తాము ఎలాంటి వేలం నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నవారిని పిలిపించి మాట్లాడకుండా మైక్ ద్వారా చాటింపు వేయాల్సిన అవసరం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇక నుంచి మొరం అక్రమ తవ్వకాలు, రవాణా చేసినా రెవెన్యూ లేదా మైనింగ్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ సూచించారు.