ఖలీల్‌వాడి, మే 22 : గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో మొదటిసారిగా చీఫ్ మినిస్టర్ కప్ -2023 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులతో కలిసి క్రీడాపోటీలను సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీ డా స్పూర్తిని చాటుతూ సహృద్భావ వాతావరణంలో పోటీలను విజయవంతం చేస్తామని క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. వాలీబాల్ , ఖోఖో, కబడ్డీ, అర్చరీ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ దిశగానే గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పా టు చేశారన్నారు. విద్యార్థులు, యువత వీటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి మలావత్ పూర్ణతో పాటు నిఖత్ జరీన్, యెండల సౌందర్య, గుగులోత్ సౌమ్య, హుసాముద్దీన్, ఇషాసింగ్ వంటి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న పీడీలు, పీఈటీలను మంత్రి అభినందించారు.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు, మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడే క్రీడలను ప్రతిఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ కప్ – 2023 క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు.
ఈనెల 15, 16, 17వ తేదీల్లో మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రస్తుతం జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లోనూ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఆర్డీవో రవి పాల్గొన్నారు.