కామారెడ్డి/ఖలీల్‌వాడి/ఆర్మూర్, ఆగస్టు 4 ; ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై శాసనసభలో గళమెత్తారు. జీరో అవర్‌లో పలు ప్రశ్నలను లేవనెత్తారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ హబ్, ఐటీ సేవల విస్తరణపై నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి పలు ప్రశ్నలు అడిగారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి సమాధానాలిచ్చారు.
ఐటీ రంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తారా? ;అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
ఖలీల్‌వాడి, ఆగస్టు 4 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఐటీ రంగం విస్తరణ, అభివృద్ధిపై పలు ప్రశ్నలు అడిగారు. నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసినందుకు జిల్లా యువత తరఫున ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నాయి. ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటీ ? ఐటీ కంపెనీలు ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరింపజేసే ఆలోచన ఏమైనా ఉందా ? శాటిలైట్ సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా ? గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రంగాన్ని విస్తరించే ఆలోచన ఉందా? అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
కాళేశ్వరం జలాలు అందించాలి ; ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, ఆగస్టు 4 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసన సభ జీరో అవర్‌లో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. కాళేశ్వరంప్యాకేజీ -22 ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు నీరు అందించాలని కోరారు. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. కామారెడ్డి నియోజకవర్గంలో రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, సత్వరమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందించాలని కోరారు. సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.
పట్టణాలకు ఐటీని విస్తరించాలి ; ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, ఆగస్టు 4: నేడు సాంకేతిక విప్లవానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ రంగంలో అభివృద్ధిపై మాట్లాడారు. ఐటీకి హైదరాబాద్ రారాజు అని, ఐటీ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని అన్నా రు. ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమి తం చేయలేదని, అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నదని అన్నారు. 2014కు ముందు హైదరాబాద్ అంటే లూటీ అని , ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ అన్నారు. కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణగా సమర్థ సేవలతో గొప్ప భవిష్యత్తు నేత అని నిరూపించారన్నారు. ఆర్మూర్ వంటి పట్టణాలకు సైతం ఐటీని విస్తరింపజేయాలని జీవన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నిరోధానికి రీసెర్చ్ సెంటర్ నెలకొల్పాలని విన్నవించారు. రాష్ట్రం నుంచి రూ. 2లక్షల 41వేల 275 కోట్ల ఐటీ ఎగుమతులు జరగడం హర్షణీయమన్నారు. దేశంలో వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నదని గుర్తుచేశారు. నిజామాబాద్ నగరానికి ఐటీ ప్రాజెక్టు ఇచ్చినందుకు ఐటీ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.